ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ మరో భారీ షాకిచ్చింది. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన భారత జట్టును తొలి వన్డేలో చిత్తుగా ఓడించి.. విమర్శల సుడిగుండలంలో చిక్కుకున్న రోహిత్ సేనను మరింత లోతుకు నెట్టింది. టీమిండియా అనే భయం లేకుండా ఆడిన బంగ్లాదేశ్ అద్భుత పోరాటంతో క్రికెట్ అభిమానులు హృదయాలను గెలుచుకుంది. అయితే.. కొన్ని రోజుల క్రితం టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌తో తలపడిన బంగ్లాదేశ్‌కు ఇప్పుడు టీమిండియాను ఓడించిన బంగ్లాదేశ్ జట్టులో చాలా మార్పు కనిపిస్తోంది. దాదాపు అదే జట్టు.. ఆ ఆటగాళ్లే.. కానీ ఏదో మారింది. ఆ మార్పు పేరే లిట్టన్ దాస్. బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్.
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో ఆడిన బంగ్లాదేశ్ టీమ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్‌గా ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. ఆ టీమ్ మైండ్‌సెట్ ఏ విధంగా ఉందో అర్థమైపోతుంది. ‘మేము వరల్డ్ కప్ గెలిచిచేందుకు రాలేదు. కానీ.. టీమిండియా వరల్డ్ కప్ గెలిచేందుకే వచ్చింది’ అంటే టీమిండియా కంటే తమ టీమ్ వీక్ అనే విషయం వారి మైండ్‌లో ఉండిపోయింది. కానీ.. లిట్టన్ దాస్ మాత్రం ఆ మ్యాచ్‌లో సైతం విరోచితంగా పోరాడి.. దాదాపు టీమిండియాను ఓడించేంత పని చేశాడు. అదృష్టం కొద్ది వర్షం వచ్చి టీమిండియా బతికిపోయింది. అప్పుడు తనలో ఉన్న ఫైర్‌నే ఇప్పుడు కెప్టెన్‌గా జట్టు మొత్తానిక నూరిపోస్తున్నాడు. అదే ఇప్పుడు టీమిండియాను బంగ్లాదేశ్ ఓడించేలా చేసింది.
టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు మనపై వారికి మంచి విన్నింగ్ రికార్డు ఉండొచ్చు. కానీ.. ఈ రోజు మనది. మనం టీమిండియాను ఓడిస్తున్నాం, భారత్ పెద్ద జట్టు అయితే.. గెలవాలనే మన కసి వారిని ఓడిస్తుందంటూ.. కెప్టెన్‌గా ప్రతి బంగ్లా ఆటగాడి మైండ్‌సెట్‌ను ట్రైన్ చేశాడు. అదే కసి ఆదివారం మ్యాచ్‌లో ప్రతి బంగ్లాదేశీ ప్లేయర్‌లో కనిపించింది. చిట్టచివరి వికెట్‌తో టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ.. 51 పరుగులు చేసి గెలిచిందంటూ.. బంగ్లాదేశ్‌లో ఎంత ధైర్యం వచ్చిఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ధైర్యానికి కారణం లిట్టన్ దాస్. భారత సంతతికి చెందిన లిట్టన్ దాస్.. టీమిండియాపైనే టెస్టు, వన్డే అరంగేట్రం చేశాడు. కానీ.. ఇటివల టీ20 వరల్డ్ కప్‌లో అతను ఆడిన తీరుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కెప్టెన్.. ఏకంగా టీమిండియానే ఓడించి, బంగ్లాదేశ్ భవిష్యత్తు మార్చే కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుపై ఇంతటి ప్రభావం చూపిస్తున్న లిట్టన్ దాస్.. గతంలో అదే జట్టులో జాతి వివక్షను సైతం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. హిందువు అనే ఒకే ఒక్క కారణంతో దాస్ అవమానాలు పడ్డాడు. బంగ్లాదేశ్ జట్టులో ఉన్న ఇద్దరు హిందూ క్రికెటర్లలో దాస్ ఒకడు కావడం. మరో ఆటగాడు సౌమ్యా సర్కారు. హిందువు అనే కారణంగానే కొన్ని టోర్నీల్లో సైతం దాస్‌ను పక్కన పెట్టారని అతని సన్నిహితులు పలు సందర్భాల్లో వెల్లడించారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌లోని దినాజ్ పూర్ ప్రాంతానికి చెందిన బెంగాలీ హిందూ కుటుంబంలో పుట్టాడు. క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్న లిట్టన్ దాస్.. జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. జాతి వివక్షను ఎదుర్కొంటూనే.. సత్తా చాటాడు. 2018 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాపై సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోయినప్పటికీ దాస్ పోరాటానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆ తర్వాత నుంచి బంగ్లాదేశ్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారిన దాస్‌ను టీ20 వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియాతో వన్డే సిరీస్ కోసం అతన్ని జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్న లిట్టన్ దాస్.. పటిష్టమైన టీమిండియాను ఓడించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లాడు. బౌలర్లను ఒక ప్రణాళిక ప్రకారం ప్రయోగించి.. ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక ఆటగాళ్లను త్వరగా అవుట్ చేసి.. కెప్టెన్‌గా వందకు వందశాతం సక్సెస్ అయ్యాడు. సరైన టైమ్‌లో బౌలింగ్ ఛేంజెస్ చేసి.. మంచి కెప్టెన్సీని చూపించాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టు నుంచి చూసి భయపడే బంగ్లాదేశ్ మైండ్‌సెట్‌ను మార్చివేశాడు. ఇదే.. రానున్న కాలంలో బంగ్లాదేశ్ టీమ్‌ను ఒక పటిష్టమైన జట్టుగా మార్చే మంత్రంగా మారనుంది. భారత సంతతికి చెందిన ఆటగాడు.. అదే భారత జట్టుపైనే విషయం సాధించి.. జాతి వివక్ష చూపి తనను అవమానించిన జట్టు తలరాతను మార్చబోతున్నాడు.
🏆⌛️ pic.twitter.com/fYMPrwZ858
— Litton Das (@LittonOfficial) December 3, 2022