గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ అటాక్‌లో కీలకంగా మారాడు మహ్మద్ షమీ. పదునైన పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బాల్స్‌ను ఆడలేక బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి షమీపై అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై షమీ సహచర ఆటగాడు ఇషాంత్ శర్మ తాజాగా ఓ షోలో మాట్లాడాడు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమ్‌కు ఎన్నో అపురూపమైన విజయాలను అందించాడు. పదునైన వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు విసిరే బంతులకు బ్యాట్స్‌మన్ దగ్గర సమాధానమే ఉండదు. షమీ బౌలింగ్‌లో కచ్చితత్వాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకే లెంగ్త్‌లో నిలకడగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయడంలో అతడు దిట్ట. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా షమీ లాంటి పేసర్లు చెలరేగడం భారత్‌కు గొప్ప విజయాలు దక్కాయని చెప్పొచ్చు. ప్రస్తుత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న షమీ క్రికెట్ కెరీర్ బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సమస్యలు ఉన్నాయి.
షమీకి తన మాజీ భార్య హసీన్ జహాన్‌తో అప్పట్లో విభేదాలు వచ్చిన సంగతి విదితమే. తన మీద షమీ గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హసీన్ 2018లో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడని గతంలో ఆమె ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు చేసింది. షమీపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల మీద టీమిండియా ఫాస్ట్ బౌలర్, షమీ సహచరుడు ఇషాంత్ శర్మ తాజాగా ఓ షోలో మాట్లాడాడు. షమీ పర్సనల్ విషయాలు తనకు తెలియదని.. కానీ, 200 శాతం అతడు ఫిక్సింగ్ చేయలేదని నమ్ముతున్నానని చెప్పాడు.
ఈ అంశం గురించి షమీ తనతో చాలా సేపు మాట్లాడాడని ఇషాంత్ అన్నాడు. అప్పుడు అతడితో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం తమను సంప్రదించిందని చెప్పానన్నాడు. ‘షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయగలడా లేదా అని బీసీసీఐ అధికారులు మమ్మల్ని అడిగారు. పోలీసులు ఎలా ప్రశ్నిస్తారో.. వీళ్లు కూడా అదే మాదిరిగా మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మేం చెప్పిన వివరాలను రాసుకున్నారు. అయితే షమి వ్యక్తిగత విషయాలు నాకు తెలీదు. అతడు ఫిక్సింగ్ చేయలేదని నమ్ముతున్నా. ఎందుకంటే షమీ గురించి నాకు తెలుసు’ అని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇవే మాటలను తాను షమీతో చెప్పానని.. వీటిని విని అతడ్ని నేనెలా అర్థం చేసుకున్నానో తెలుసుకున్నాడని ఇషాంత్ వివరించారు. తద్వారా తమ అనుబంధం మరింత బలపడిందన్నాడు. కాగా, ఫిక్సింగ్ ఆరోపణపై ఇన్వెస్టిగేషన్ చేపట్టిన బీసీసీఐ.. ఆఖరుకు షమీకి ఇందులో క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.