ప్రస్తుతం సగటు క్రికెట్ అభిమానుల చూపు మెుత్తం ఐపీఎల్ పైనే. అదేంటి ఐపీఎల్ ఇంకా మెుదలు కాలేదు కదా? అన్న అనుమానం మీకు రావొచ్చు. ఐపీఎల్ పైనే అంటే.. శుక్రవారం(డిసెబంబర్ 23)న జరిగే IPL 2023 మెగావేలం పైనే అందరి కళ్లు అని. ఇక ఈ వేలంలో ఎవరు భారీ ధర పలకబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలిసి పోతుంది. ఇలాంటి టైమ్ లో నాలుగా సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఐర్లాండ్ నయా సంచలనం లిటిల్ జోషువా. CSK తన పట్ల అమర్యాదగా ప్రవర్తించింది అంటూ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చాడు.
లిటిల్ జోషువా.. టీ20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్ పై హ్యట్రిక్ సాధించి ఒక్క సారిగా సంచలనం రేపాడు. దాంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. స్టార్ బౌలర్ పేరుగాంచాడు. అయితే 2022 సీజన్ లో సిఎస్కే తరపున ఐపీఎల్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు లిటిల్. ఈ క్రమంలోనే సీఎస్కే జట్టు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేనొక అంతర్జాతీయ బౌలర్ అన్న సంగతికూడా మర్చిపోయి, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని వాపోయాడు లిటిల్ జోషువా. సీఎస్కే యాజమాన్యం నన్ను జట్టులోకి తీసుకునే ముందు చెప్పింది ఒకటి.. తర్వాత చేసింది మరోటి అని లిటిల్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే జట్టులో ఎవరైనా గాయపడినప్పుడు అవకాశం కల్పిస్తామని చెప్పారని, కానీ కనీసం నెట్ బౌలర్ గా కూడా నన్ను పూర్తిగా వినియోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటికే నేను చాలా ప్రీమియర్ లీగ్ లు ఆడనని, జాతీయ జట్టులో సైతం సత్తా చాటానని జోషువా పేర్కొన్నాడు. ట్రయినింగ్ సెషన్స్ లో కూడా సరిగ్గా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని, అందుకే రెండువారాల్లోనే సీఎస్కే నుంచి వైదొలిగానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు లిటిల్ జోషువా. ఇక టీ20 వరల్డ్ కప్ లో 17.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. దాంతో తాజాగా జరగబోయే మెగావేలంలో లిటిల్ భారీ ధర పలికే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.