భారత్, ఇంగ్లాండ్ టెస్టు సరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వచ్చినా.. మరో వార్త టీమిండియాని కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనాతో హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా చేరిపోయారు. వీరికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఓవల్ వేదికగా సాధించిన అద్భుత విజయాన్ని ఆశ్వాదించక ముందే ఈ వార్తతో క్రికెట్ అభిమానుల్లో కలవరం మొదలైంది.
ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా విజయం మాంచెస్టర్ టెస్టుపైనే ఆధారపడి ఉంది. సిరీస్‌ని కైవశం చేసుకోవాలంటే అయితే విజయం లేదా డ్రాగా మ్యాచ్‌ని ముగించాలి. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ పరంగా కాస్త కంగారు పెట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్ పరంగా రోహిత్ (127), పుజారా(61), శార్దూల్(60), పంత్(50), రాహుల్(46), కోహ్లీ(44) ప్రదర్శనతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే కనిపించింది. మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్ పరంగా అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓవల్‌లో ఆఖరిరోజు 10 వికెట్లు తీసిన టీమిండియా బౌలింగ్ లైనప్‌పై పెద్దగా సంకోచాలు ఏమీ లేవు. ఇషాంత్, షమీ, అశ్విన్ వంటి సీనియర్ బౌలర్లు లేకుండానే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసి అద్భుత విజయం సాధించారు. కానీ.. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌లు లేకుండా మాంచెస్టర్‌లో ప్రదర్శన ఎలా చేస్తారు అన్నదే అందరి ప్రశ్న. వాటిని ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మంగళవారం టీమిండియా కోచ్‌లు లేకుండానే మాంచెస్టర్‌కు పయనం కావాలి.
‘స్టార్ గేజింగ్: ది ప్లేయర్స్ ఇన్ మై లైఫ్’ అంటూ రవిశాస్త్రి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలోనే కోచ్‌లు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. లండన్‌లోని ఓ హోటల్ వేదికగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఆ హోటల్‌కు సాధారణ అతిథులకు కూడా అనుమతి ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రవి శాస్త్రి ముందే పాజిటివ్ రాగా.. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు మరుసటి రోజు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ కరోనా ప్రభావం ఇంకా ఎవరిపైనైనా ఉండబోతోందా? అన్నదే కలవరపెడుతున్న ప్రశ్న. సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.