ఐసీసీ టోర్నీ... టీమిండియా దురదృష్టం. ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ధోనీ అప్పుడు వన్డే వరల్డ్ కప్ లో ఔటయ్యాడో.. సేమ్ ఇప్పుడు హర్మన్ ప్రీత్ ఔట్ అయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? భారత జట్టుకే ఎందుకు ఇలాంటి పరిస్థితి?
షర్ట్ కు బురద అంటుంకుంటే ఓ పట్టాన వదలదు. టీమిండియాకు అంటుకున్న దురదృష్టం కూడా అలానే వదలట్లేదు. పురుషుల జట్టు వరకే అనుకుంటే.. మహిళల జట్టుకు సేమ్ దరిద్రం పట్టుకుంది. ఐసీసీ టోర్నీల్లో ఒక్కటంటే ఒక్కదానిలోనూ కప్ కొట్టలేకపోతున్నారు. టోర్నీ అంతా అద్భుతంగా ఆడుతున్నారు. సరిగ్గా నాకౌట్ మ్యాచులకు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నారు. తాజాగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ కావొచ్చు.. 2019లో పురుషుల వన్డే ప్రపంచకప్ కావొచ్చు.. సేమ్ సీన్ రిపీటైనట్లు అనిపించింది. ఇంతకీ మన జట్టుకు ఎందుకిలా జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ అమ్మాయిలు బాగానే ఆడారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. ఫైనల్ లో అడుగుపెట్టేయొచ్చు. ఈ ధీమాతోనే గురువారం జరిగిన మ్యాచ్ ఆడారు. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 28 పరుగులకే 3 వికెట్లు పోయాయి. అయితేనేం జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా పోరాడారు. జెమీమా ఔటైపోయింది కానీ హర్మన్ ప్రీత్ మాత్రం దుమ్మురేపే బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించింది. దీంతో మ్యాచ్ మనదే అని అందరూ ఫిక్సయిపోయారు. ఆరోగ్యం సరిగా లేనప్పటికీ హర్మన్ ఆట చూసి ఫిదా అయిపోయారు. కానీ ఇంకొంతసేపు ఆడితే మనం గెలిచేస్తాం అనే టైంలో హర్మన్ రనౌట్ అయిపోయింది. దీంతో మ్యాచ్ కూడా పోయింది.
జెమీమా ఔటైన తర్వాత జట్టుని గెలిపించే బాధ్యత తీసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్.. 15 ఓవర్లో రెండు ఫోర్లు బాది 32 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసింది. కానీ అదే ఓవర్ లో రనౌట్ అయిపోయింది. డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టిన హర్మన్.. సులభంగా రెండు రన్స్ తీసేయొచ్చనే ఉద్దేశంతో అనుకున్నదానికంటే కాస్త నెమ్మదిగా పరుగెత్తింది. అదే టీమిండియా కొంప ముంచింది. సరైన టైంకి క్రీజులోకి చేరుకుంది కానీ బ్యాట్ మాత్రం లైన్ కంటే ముందు స్ట్రక్ అయిపోయింది. దీంతో హర్మన్ తన పాదాలు లోపల పెట్టేలోపే.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ రనౌట్ చేసింది. దీన్ని అస్సలు ఊహించలేకపోయిన హర్మన్.. ఔటైన తర్వాత బ్యాట్ నేలకేసి బలంగా బాదింది. పెవిలియన్ కు వెళ్లి తెగ ఏడ్చేసింది. ఆ ఒక్క రనౌట్ కాకపోయింటే రిజల్ట్ వేరేలా ఉండేది. చెప్పాలంటే ఈ స్టోరీ కూడా రాయాల్సిన అవసరం ఉండేది కాదు.
హర్మన్ రనౌట్ చూడగానే.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ధోనీ రనౌట్ చాలామందికి గుర్తొచ్చింది. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన టైంలో గప్టిల్ వేసిన త్రో వల్ల ధోనీ రనౌట్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ మరోసారి ముద్దాడాలనే భారత్ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ధోనీ రనౌట్ అవగానే స్టేడియం మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఈ రెండు రనౌట్స్ కు దగ్గర పోలికలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇద్దరి జెర్సీ నంబర్ 7. సెమీఫైనల్ మ్యాచులోనే రనౌట్ అయ్యారు. హర్మన్ కెప్టెన్ కాగా, ధోనీ అప్పుడు మాజీ కెప్టెన్. అయితే ఇలా జరగడానికి టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడిలో పడిపోవడమే కారణమని తెలుస్తోంది. లీగ్ మ్యాచులు బాగా ఆడుతున్నప్పటికీ.. నాకౌట్ మ్యాచుల్లోని కీలక సందర్భాల్లో చేతులెత్తేస్తున్నారు. ఈ ఒక్క సమస్యని పరిష్కరించుకుంటే.. టీమిండియా కప్ కొట్టడం సులభమవుతుంది. మరి ఇలా టీమిండియా రనౌట్ శాపంలా మారడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.