టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సాధారణ కుటుంబం నుంచి కోటీశ్వరుడయ్యాడు. అయితే దీని వెనుక ఎంత కష్టం ఉందో ఆ స్థాయికి రావడానికి తాను తన సోదరుడు కృనాల్ పాండ్యా ఎంత కష్టపడ్డామో అన్న విషయం పలు సందర్భాల్లో తెలిపాడు. హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మంచి క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్‌లోనూ ఒకే టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
బరోడాలో చిన్న అపార్ట్‌మెంట్లో జీవించే అతని కుటుంబం ఇప్పుడు ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్లో ఉంటోంది. ఐపీఎల్ వేలంలో భారీ అమౌంట్ పలికిన తర్వాత ప్లేయర్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. నేను, కృనాల్ దృఢచిత్తం కలిగిన వాళ్లం. ఐపీఎల్‌లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదు. అహంభావం.. లేక్కలేని తనం అస్సులు ఉండకూడదని అన్నారు.
ఒకవేళ నాకు క్రికెట్ లో అవకాశాలు రాకపోయినట్లయితే.. ఇప్పటికి ఏ పెట్రోల్ పంపులోనూ పనిచేస్తూ ఉండేవాడిని.. ఇది పచ్చి నిజం అని అన్నారు. నా వరకు కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. నా కుటుంబ సభ్యులకు మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేసేందుకు వెనుకాడను అని పేర్కొన్నాడు. 2019లో ఓ వ్యక్తితో మాట్లాడా.. అతను యువ క్రికెటర్ల దగ్గర డబ్బులు ఉండవని అన్నాడు. దానికి నేనొప్పుకోలేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచో లేదంటే టౌన్ నుంచో వచ్చిన వ్యక్తికి భారీ కాంట్రాక్టు దొరికితే ఆ డబ్బును అతనొక్కడే ఉంచుకోడు. ముందు పేరెంట్స్, తర్వాత బంధువులకు ఖర్చుపెట్టాలనుకుంటాడు. అయితే డబ్బు చాలా తేడా చూపిస్తుంది. తారతమ్యాలను కూడా పుట్టిస్తుందని అంటారు. ఇది నేను ఎప్పటికీ నమ్మను.. ఎందుకంటే నీకు ఆట అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు డబ్బు కూడా ముఖ్యమే అని పాండ్యా పేర్కొన్నాడు.