వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచులో టీమిండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. ఈ ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్యనే అని అందరూ అంటున్నారు. ఈ విషయంపై హార్దిక్ ఏం చెప్పాడంటే..?
వెస్టిండీస్ తో టీ 20 సీరీస్ లో భాగంగా టీమిండియా చివరిదైన 5వ టీ 20 లో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. తొలి రెండు మ్యాచులు విండీస్ జట్టు గెలవగా.. మూడు, నాలుగు వన్డేల్లో మాత్రం టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 20 ఒవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (45 బంతుల్లో 61 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా తిలక్ వర్మ (18 బంతుల్లో 27) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ కి నాలుగు, అకెల్ హుస్సేన్ కి రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే 18 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ బ్రాడం కింగ్(55 బంతుల్లో 85) చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని పూర్తి చేయగా ఫామ్ లో ఉన్న పూరన్ 35 బంతుల్లో 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓడిపోవడం మంచిదే అని కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు విండీస్ మీద ఆధిపత్యం చూపించలేకపోయింది. అనుభవం లేకపోవడం, ఒత్తిడిని అధిగమించే ప్లేయర్లు లేకపోవడం భారత్ జట్టు మీద తీవ్ర ప్రభావం చూపించాయి. హార్దిక్ నేతృత్వంలో యువ జట్టు తమ సత్తా మేరకు ఆడి రాణించినా నిర్ణయాత్మకమైన 5 టీ 20 లో బ్యాటర్లు, బౌలర్లు చేతులెత్తేయడంతో నిరాశ తప్పలేదు. దీంతో 17 ఏళ్ళలో 3 లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచుల సిరీస్ లో విండీస్ జట్టు మీద సిరీస్ ఓడిపోయిన చెత్త రికార్డ్ ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ ఓటమి గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే అంటున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఈ విషయాలన్నిటికీ కెప్టెన్ హార్దిక్ పాండ్య సమాధానమిచ్చాడు.
హార్దిక్ మాట్లాడుతూ ” ప్రతిసారి గెలవడం సాధ్యపడదు. కొన్ని సార్లు ఓడిపోవడం కూడా మంచిదే. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మా టీం చాలా గొప్పగా ఆడింది. అందుకు వారిని మెచ్చుకొని తీరాలి. గెలుపోటములు ఆటలో సహజం”. అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. హార్ధికి చేసిన ఈ కామెంట్స్ కి జనాలు విమర్శిస్తున్నారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడానికి గల కారణాన్ని తెలియజేస్తూ “మేం పదో ఓవర్ తర్వాత తడబడ్డాం. నేను క్రీజులోకి వచ్చిన తర్వాత భారీ షాట్లు ఆడలేకపోయా. ఒక టీంగా మమ్మల్ని మేం ఛాలెంజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా. ఇవన్నీ కూడా మేం కొత్త విషయాలు నేర్చుకునే మ్యాచులే” అని పాండ్య చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.