ప్రత్యర్థి ప్లేయర్ ని తక్కువగా అంచనా వేస్తే ఎలా ఉంటుందో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బాగా తెలిసి వచ్చింది. ఇంతకీ హార్దిక్ ఏం చేసాడంటే..?
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డ్ లో ఎంత అగ్రెస్సివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సార్లు హార్దిక్ దూకుడు కలిసివచ్చినా మరి కొన్ని సార్లు మాత్రం హద్దులు మీరి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. టీమిండియాకు ప్రస్తుతం ఏకైక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడం, పరిమిత ఓవర్ల క్రికెట్ లో తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ టీంని సక్సెస్ ఫుల్ గా నడిపించడం లాంటి అంశాలు హార్దిక్ స్టార్ డంని అమాంతం పెంచేసాయి. అయితే కొన్నిసార్లు హార్దిక్ అత్యుత్సాహం అతన్ని వెనక్కి లాగుతున్నాయి. ఇటీవలే మూడో టీ 20 మ్యాచులో భాగంగా తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా.. సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి తన ఆటిట్యూడ్ తో వార్తల్లో నిలిచాడు.
నిన్న(ఆదివారం) నిర్ణయాత్మక ఐదవ టీ 20 మ్యాచులో వెస్టిండీస్ జట్టు టీమిండియా మీద 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ చేజిక్కిచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ 35 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో విండీస్ కి విజయాలను అందించిన పూరన్ ఆ తర్వాత రెండు టీ 20 మ్యాచుల్లో మాత్రం నిరాశపరిచాడు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డాడు. ఈ సందర్భంగా హార్దిక్ కాస్త వెటకారంగా మాట్లాడాడు. పూరన్ సిక్సులు కొట్టాలంటే ముందుగా నా బౌలింగ్ లో కొట్టమని చెప్పండి అంటూ చెప్పుకొచ్చాడు.
పూరన్ కి ఈ అవకాశం నాలుగో టీ 20 లో రాకపోయినా 5 వ టీ 20 మ్యాచులో మాత్రం హార్దిక్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. పాండ్య వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులని సిక్సర్లుగా మలచి హార్దిక్ కి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాడు. తొలి ఓవర్లో 11 పరుగులు సమర్పించుకున్న ఇండియన్ కెప్టెన్.. మూడో ఓవర్లో తొలి నాలుగు బంతులని బాగా వేసినా చివరి రెండు బంతులకి మాత్రం సిక్సులు కొట్టి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. దీంతో అనవసరంగా అత్యుత్సాహానికి పోయిన ఈ స్టార్ ఆల్ రౌండర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.