‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో టీమిండియా శుభారంభం చేయలేక పోయినా.. తర్వాతి మ్యాచ్ కోసం ఎంతో కృషి చేస్తోంది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో 3 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. మరోవైపు పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అసిఫ్ అలీ ఒకే ఓవర్‌లో 4 సిక్సులు బాది మ్యాచ్ గెలింపించిన విషయం తెలిసిందే. కానీ, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన ప్రశ్నార్థకంగానే ఉంది. వచ్చే మ్యాచ్‌లో అయినా బౌలింగ్ చేస్తాడో? లేదో? ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అసలు హార్దిక్ పాండ్యా ఫామ్ ఎందుకు కోల్పోయాడు? పరిశీలిద్దాం.
ఐపీఎల్ కోసమే
కోల్‌కతా జట్టు ఫైనల్ చేరిన సందర్భంలోనూ ఆండ్రూ రస్సెల్ మ్యాచ్ ఆడకుండా వరల్డ్ కప్ కోసం డగౌట్‌లోనే కూర్చున్నాడు. అంటే అతనికి ఐపీఎల్ ముఖ్యం కాదు.. ఐసీసీ వరల్డ్ కప్ కోసమే అతను అలా విశ్రాంతి తీసుకున్నాడు. మరోవైపు క్రిస్ గేల్ కూడా వరల్డ్ కప్ కోసం మానసికంగా సిద్ధం కావాలంటూ ఐపీఎల్‌కు దూరం అవ్వడం చూశాం. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకోకుండానే.. బ్యాటింగ్ చేస్తూ ఐపీఎల్‌లో నెట్టుకొచ్చాడు. అదే ఆ సమయంలో సరైన విశ్రాంతి తీసుకుని మానసికంగా.. శారీరకంగా సంసిద్ధం అవ్వాల్సిందని అభిమానులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఐపీఎల్ కోసం చేసిన కృషే ఇప్పుడు టీమిండియా కొంప ముంచుతోందని ఆరోపిస్తున్నారు మరికొందరు. కేవలం బ్యాటింగ్ కోసమే అయితే హార్దిక్ పాండ్యా మీద ఎందుకు ఆధారపడుతున్నారు? అంటూ మాజీలు, విమర్శకులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఆల్‌రౌండర్లు అందరూ వరల్డ్ కప్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తే హార్దిక్ పాండ్యా మాత్రం ఐపీఎల్ కోసమే కృషి చేశాడంటూ విమర్శిస్తున్నారు. హార్దిక్ పాండ్యా నిజంగానే టీ20 వరల్డ్ కప్‌ను లైట్‌గా తీసుకున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.