పుష్ప సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో మరోసారి తెలిసొచ్చింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ ఆసీస్ అభిమాని అల్లు అర్జున్ మ్యానరిజంతో టీమిండియాను వెక్కిరించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెంటో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 263 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లో కష్టాలు పడుతోంది. 21 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్.. వెంటవెంటనే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. తొలుత కేఎల్ రాహుల్‌ను నాథన్ లయన్ లెగ్ బిఫోర్‌గా అవుట్ చేసేశాడు. నాథన్ తన మరుసటి ఓవర్‌లోనే మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రెండో బంతికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేసిన లయన్.. నాలుగో బంతికి వందో టెస్టు ఆడుతున్న పుజారాను డకౌట్ చేశాడు. ఇలా 54 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత మరికొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్‌ను సైతం లయన్ అవుట్ చేయడంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా అభిమానులు ఫుల్ జోష్‌లో కనిపించారు. అయ్యర్ వికెట్ పడగానే.. ఓ ఆస్ట్రేలియన్ అభిమాని పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మ్యానరిజం ‘గడ్డం కింద చేయి పోనిచ్చి.. తగ్గేదేలే’ అంటూ టీమిండియాను వెక్కిరించాడు. తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అనే కసి ఆ అభిమానిలో కనిపించింది. ప్రస్తుతం అతను పుష్ప మ్యానరిజం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత క్రికెట్ అభిమానులు కూడా ఆ ఆసీస్ ఫ్యాన్ ఉత్సాహన్ని సరదాగా తీసుకుంటున్నారు.
ఖండాంతరాలు దాటిన పుష్ప క్రేజ్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా విడుదలైన ప్రతి భాషలోనూ అద్భుత విజయం సాధించింది. ఆ సినిమాలోని డైలాగులు, మ్యానరిజం యువతకి బాగా ఎక్కేసింది. ఒక తెలుగు సినిమాకు ఇలాంటి భారీ విజయం దక్కడంపై ప్రతి తెలుగు సినిమా అభిమాని సంతోషించాడు. అలాగే.. డేవిడ్ వార్నర్ లాంటి అంతర్జాతీయ క్రికెట్‌స్టార్లు పుష్ప పాటలకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంతో పుష్పకు ఆస్ట్రేలియాలోనే మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అభిమానులు అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేయడానికి పుష్ప క్రేజ్‌కు తోడు, వార్నర్ రీల్స్ చేయడం కూడా ఒక కారణం. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, అలాగే ఆసీస్ ఫ్యాన్స్ వెక్కిరింతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#BGT23 #IndvsAus2ndtest #PushpaTheRule #AlluArjun pic.twitter.com/hnAZZO7qdf
— Sayyad Nag Pasha (@nag_pasha) February 18, 2023