ఆస్ట్రేలియా.. 1987 నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న జట్టు. కరేబియన్ వీరుల ప్రభావం తగ్గిన తర్వాత.. క్రికెట్ రాజ్యాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఏలింది కంగారులే. గత మూడు, నాలుగేళ్లుగా వారి కీర్తి కాస్త మసక బారుతూ.. ఆస్ట్రేలియా అంటే ఉన్న భయం తగ్గుతూ వస్తోంది. కానీ.. 1987 నుంచి 2015 మధ్య 8 వన్డే వరల్డ్ కప్‌లు జరిగితే.. ఏకంగా 5 సార్లు ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది. ఆ టైమ్‌లో వారి డామినేషన్ ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లు.. స్టీవా, రికీ పాంటింగ్. దిగ్గజ బ్యాటర్లు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్, మ్యాథ్యూ హేడెన్, ఆండ్రూ సైమండ్స్, మైకెల్ హస్సీ.. దిగ్గజ బౌలర్లు షేన్ వార్న్, మెక్‌గ్రాత్, బ్రెట్ లీ లాంటి హేమా హేమీలతో ఆస్ట్రేలియా పాతికేళ్లకు పైనే ప్రపంచ క్రికెట్‌ను శాసించింది.
దేశమేదైనా.. పిచ్ ఎలాంటిదైనా.. క్రికెట్ పుట్టిన ప్రాంతమైనా.. క్రికెట్‌ను మతంలా భావించే దేశమైనా.. అన్ని చోట్లా ఆస్ట్రేలియాదే హవా. ముఖ్యంగా 1997 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా ఒక తిరుగులేని శక్తిగా మారింది. వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకు లేనన్ని వరల్డ్ కప్‌లు ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కప్పుల సంగతి అటుంచితే.. క్రికెట్‌ను భయంకరంగా ఆడి ప్రత్యర్థి జట్టుకు వణుకుపుట్టించే జట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. ఆటతోనే కాదు.. మాటతోనూ ప్రత్యర్థిని ఓడించడం ఒక్క ఆస్ట్రేలియాకే సాధ్యం. ప్రపంచ మేటి ఆటగాళ్లతో రెండు దశాబ్ధాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా చరిత్రపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచాన్ని మోసం చేస్తూ.. ఆటలో దొంగదారిలో ఛాంపియన్‌గా చెలామణీ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్వర్ణయుగంపై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు ఏంటి? అవి ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆ జట్టుకు కెప్టెన్ కాకుండా అతనిపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. 2018 మార్చిలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్టు జరిగింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌తో పాటు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాల్ రివర్స్ స్వింగ్ అయ్యేందుకు బాల్‌ను ఒక పక్క పాతగా చేసేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. ఈ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రకంపనలు చెలరేగాయి. స్మిత్ ఏకంగా మీడియా ముందు ఏడ్చుకుంటూ.. తమ తప్పును ఒప్పుకున్నాడు.
నిషేధం ముగిసిన జాతీయ జట్టులోకి వచ్చి అద్భుతంగా ఆడుతున్నా.. డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ కాలేకపోతున్నాడు. అయితే తన ప్రదర్శన ఆధారంగా తనపై ఉన్న కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తివేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు విన్నవించుకున్నాడు వార్నర్. తాజాగా ఆ వినతిని ఉపసంహరించుకున్నాడు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ఏజెంట్ జేమ్స్ ఎర్‌స్కైన్ చేసి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 2017-18లో యాషెస్ సిరీస్‌కు ఆరు నెలల ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా ‘సాండ్ పేపర్ గేట్’తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే సౌతాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వెనుక కేవలం వార్నర్, స్మిత్, బాన్‌క్రాఫ్ట్ మాత్రమే లేరని మరో బాంబు పేల్చాడు. ఆ బాల్ ట్యాంపరింగ్ ఆస్ట్రేలియా టీమ్ మొత్తానికి, మేనేజ్‌మెంట్‌తో సహా అందరికీ తెలిసే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా ఘన చరిత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఆటతో కాకుండా.. ఇలా బాల్ ట్యాంపరింగ్‌తో మోసం చేస్తూ.. అన్నేళ్లు ఛాంపియన్ జట్టుగా చెలమణీ అయిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చుతున్నాయి. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆసీస్ బౌలర్లు వాతావరణం అనుకూలించకపోయినా బాల్‌ను రివర్స్ సింగ్ ఎలా చేయగలుగుతున్నారో తమకు అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ టైమ్‌లో అది ఆస్ట్రేలియా బౌలర్ల గొప్పతనంగా చూసిన వారందరూ.. ఇప్పుడు అది బాల్ ట్యాంపరింగ్‌తోనే సాధ్యమైందని ఆరోపిస్తున్నారు.
మైఖేల్ కాస్ప్రోవిచ్, గ్లెన్ మెక్‌గ్రాత్, గిల్లెస్పీ, బ్రెట్ లీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్లలో ముఖ్యులు. వీరందరూ రివర్స్ స్వింగ్ బాల్స్ వేయడంలో కింగులు. కానీ.. ఆ రివర్స్ స్వింగ్ అనేది బాల్ పాత బడిన తర్వాత.. వాతవరణ పరిస్థితిల అనుకూలంగా ఉంటే.. బ్యాటర్లపై ప్రయోగించే ఒక వజ్రాయుధం. పైగా రివర్స్ స్వింగ్‌ను ప్రతి ఫాస్ట్ బౌలర్ వేయలేడు.. టీమిండియాలో శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి బౌలర్లకు మాత్రమే సాధ్యమైంది. అయితే.. ఆస్ట్రేలియాలో రివర్స్‌స్వింగ్ బౌలింగ్‌లో కింగుల్లాంటి బౌలర్లు ఉన్నా.. అది నిజంగా వారి సత్తాతో వచ్చిందా? లేక బాల్ ట్యాంపరింగ్‌తో లాక్కొచ్చారా? అనే విషయంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే 2018 బాల్ ట్యాంపరింగ్ ఘటన తర్వాత.. ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన కూడా ఈ ఆరోపణలకు, సందేహాలకు బలంమిస్తోంది. 2021 టీ20 వరల్డ్ కప్ విజయం తప్పితే.. ఆ జట్టు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో.. బాల్ ట్యాంపరింగ్ మానేసిన తర్వాతే.. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో పస తగ్గినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు.. ప్రపంచాన్ని మోసం చేస్తూ.. ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా చెలామణీ అయిందా? అనే విషయంపై సోషల్ మీడియా వేదికగా సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లపై, బౌలర్ల సత్తాపై ఎలాంటి సందేహం లేకున్నా.. ఆటలో చట్ట విరుద్ధమైన బాల్ ట్యాంపరింగ్‌ను చేస్తూ విజయాలు సాధించాడు.. మోసం చేయడమే అవుతుంది. గెలిచేందుకు ఎంతకైనా తెగించే ఆస్ట్రేలియన్లు.. అలాంటి మోసానికి పాల్పడి ఉంటారని చాలా మంది నమ్ముతున్నారు.