గత కొన్ని రోజులుగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. భారత జట్టు పాక్ కు రాదని టీమిండియా ప్రకటించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో కూడా ఆసియా కప్ వేదిక ఏది అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఆసియా కప్ ఆడటానికి భారత్, పాకిస్థాన్ రాకపోతే.. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ లో మేమూ పాల్గొనబోయేది లేదని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఘాటుగా స్పందించాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
2023 ఆసియా కప్.. వరల్డ్ కప్ కంటే ఎక్కువగా క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తున్న పేరు. ఆసియా కప్ పాకిస్థాన్ లో నిర్వహిస్తే మేం పాక్ లో అడుగుపెట్టబోం అని బీసీసీఐ చెప్పుకొస్తోంది. మీరు ఆసియా కప్ లో పాల్గొనకపోతే.. మేం కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడేది లేదని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ సేథీ గతంలో తేల్చి చెప్పాడు. తాజాగా ఈ వివాదంపై ఘాటుగా స్పందించాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ”పాకిస్థాన్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. ఆడేది లేదని బీసీసీఐ ప్రకటించింది. కాబట్టి మేం ఈ టోర్నీలో పాల్గొనేది లేదు. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ లో ఆడాలి అంటే.. వేదికను మార్చాలి. అయితే ఇలా టోర్నీల వేదికలు మార్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. మేం ముందే చెప్పాం.. పాక్ లో ఆసియా కప్ నిర్వహించొద్దని. ఇక ఆసియా కప్ ను యూఏఈకి బదులుగా శ్రీలంకకు తరలిస్తే బాగుంటుంది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అశ్విన్.
అదీకాక పాక్ చెబుతున్నట్లుగా వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనకపోవడం మాత్రం అసాధ్యం. పాక్ వరల్డ్ కప్ లో ఆడకుండా అంత పెద్ద సాహసం చెయ్యదని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించిన తుది నిర్ణయం మాత్రం ఏసీసీదే అని అశ్విన్ తేల్చిచెప్పాడు. అయితే ఇప్పటికే చాలా టోర్నీలను యూఏఈ వేదికగా నిర్వహించారని, ఈసారి ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహిస్తే.. అది ప్రపంచ కప్ కు కూడా దోహదం చేస్తుందని ఈ సందర్భంగా అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి పాక్ బోర్డుపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.