ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ‘బెన్‌స్టోక్స్’ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఎలాంటి క్రికెటర్ కూడా తీసుకోని నిర్ణయం అది. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అతను ఇచ్చిన ఈ సమాచారం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. క్రికెట్‌లో కేరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉండగా అతను చేసిన ఈ ప్రకటను కారణమేంటనే విషయం ఆసక్తి రేపుతోంది.
అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్‌కు తెలియజేశాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందనీ చెప్పాడు. ఆగస్టు 4వ తేదీ నుంచి భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో బెన్‌స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ జట్టులో బాంబును పేల్చినట్టయింది. సరిగ్గా నాలుగు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ పరిస్థితుల్లో అతను చేసిన ప్రకటన ఇంగ్లాండ్ జాతీయ జట్టును ఒత్తిడిలోకి నెట్టినట్టయింది.
గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్‌స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్‌తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో తుదిశ్వాస విడిచారు. ఇది కూడా బెన్‌స్టోక్స్‌ను మానసికంగా కుంగదీసి ఉంటుందనే వాదనలు ఉన్నాయి. తండ్రికి బ్రెయిన్ కేన్సర్ ఉందనే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించిన సమయంలో కూడా బెన్ అందుబాటులో లేడు. అప్పుడతను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే అతను అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వెళ్లాడు.
బెన్‌స్టోక్స్ కొంత మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడని, అందువల్లే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో అతనికి బోర్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చాడు. అతను విశ్రాంతి తీసుకోవచ్చని, ఈ విషయం లో అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండబోదని హామీ ఇచ్చాడు. తాను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే అప్పుడు జట్టులో చేరొచ్చని స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని నిరభ్యంతరంగా ప్రకటించినందుకు అతణ్ని అభినందిస్తున్నట్లు చెప్పాడు.