వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ఇటీవల ప్రతిపక్షాలు తనపై లేని పోని నిందారోపణలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం జగన్ తనను చూసుకోమన్నారు కాబట్టే చూసుకుంటున్నా అన్నారు. విశాఖ అభివృద్ది కోసం అహర్శిశలు కృషి చేస్తున్నానని.. తన పేరు చెప్పి ఎవరైనా భూ ఆక్రమణలు, పంచాయితీలు చేస్తే ఊరుకోబోనని అన్నారు. ఇలాంటివి ఎక్కడైన జరిగితే తనకు ఫోన్ చేయాలని… వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరికైనా న్యాయం చేయలేదు, గుర్తించలేదు అనుకుంటే భవిష్యత్ లో వారికి న్యాయం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చేశాం మనల్ని ఎవరు ప్రశ్నించరు అనుకుంటే ప్రజలు హర్షించరన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారని.. సీఎం జగన్ ప్రజలకు చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభిస్తుందని.. ముందు ముందు మరిన్ని అద్భుతమైన పథకాలతో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని అన్నారు.
గత కొంత కాలంగా తనపై కొంత మంది పనికట్టుకొని మరీ రూమర్లు సృష్టిస్తున్నారని.. తనకు డబ్బు మీద ఆసక్తి లేదు… హైదరాబాద్ లో ఉన్నది కూడా అద్దె ఇల్లే లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ప్రజల మనిషిగా గుర్తింపు వస్తే చాలు అన్నారు. ప్రజాభీష్టానికి తగ్గట్టు పాలన చేయాలని మేయర్ కి, కార్పొరేటర్లకు తెలియజేసారు.