వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే దీనిపై గోరంట్ల మాధవ్ ఇప్పటికే స్పందించారు. ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ తెలిపారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని అన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని అన్నారు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎంత మేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని అన్నారు.
అది ఫేక్ వీడియో అని మాధవ్ సవాల్ చేసి చెబుతున్నాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడని సజ్జల పేర్కొన్నారు. ఏదేమైనా ఇది ప్రైవేటు వ్యవహారం కాబట్టి తక్కువగా మాట్లాడాల్సి ఉంటుందని, జగన్ చేతల్లోనే చూపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇలాంటి వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పారు. మరి.. సజ్జల రామకృష్టా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.