ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఊహించని విధంగా టీడీపీకి మెజారిటీ స్థానాలు లభించాయి. ఐతే ఈ పరిస్థితికి కారణం వాలంటీర్లేనా? వాలంటీర్లే వైసీపీ కొంప ముంచారా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అన్నట్టు రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణాలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి షాకిస్తూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ పార్టీకి షాకిచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా షాక్ ఎదురైంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.
దీనికి కారణం వాలంటీర్లే అన్న చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమికి వాలంటీర్లే కారణమా అంటే అవుననే అంటున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇలానే కొనసాగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం వాలంటీర్లే అని.. వాలంటీర్ వ్యవస్థపై రాజకీయాలను వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వాలంటీర్లు ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ రప్పించగలరు కానీ ఓట్లు వేయించలేరని.. అధికార పార్టీకి ఓట్లు వేసేంతగా జనాన్ని ప్రభావితం చేయలేరన్న విషయం వైసీపీ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో స్పష్టంగా అర్ధమయ్యింది.
మొదటి నుంచి వాలంటీర్లు అంటే ఓట్లు ప్రభావితం చేసే శక్తి అని వైసీపీ పార్టీ భావిస్తూ వచ్చింది. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడం, ప్రజల అవసరాలను తీర్చడం వంటి కార్యక్రమాల వల్ల ఓటర్లను ప్రభావితం చేయవచ్చు అని అధికార పార్టీ భావించింది. మొత్తం వాలంటీర్లకే వదిలేసింది. రోజూ వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తున్నారు కదా అన్న ఆలోచనతో వైసీపీ పార్టీ ఉంది. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థే ఇప్పుడు వైసీపీ కొంప ముంచింది. వాలంటీర్ వ్యవస్థ అనేది జనాన్ని పోలింగ్ బూత్ ల వరకూ రప్పించడం వరకూ పని చేస్తుంది గానీ జనంతో ఓట్లు అయితే వేయించేంతగా ప్రభావితం చేయలేదన్న విషయాన్ని అధికార పార్టీ గ్రహించింది.
మరొక అంశం ఏంటంటే.. సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల కూడా ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు. ఈ రెండు అంశాలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీసేందుకు దారి తీశాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తపడకపోతే, వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా నమ్మితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. మరి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాజకీయాన్ని వాలంటీర్లకే వదిలేయకుండా జాగ్రత్త పడుతుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.