ఆస్పత్రిలో లిఫ్ట్ కుప్పకూలిన ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలోని నల్లచెరువులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి వార్షికోత్సవానికి వెళ్లారు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఇక అనుకున్న సమయానికి ఎమ్మెల్యేతో పాటు బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు. ఇక ఆ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు ఎక్కేందుకు అంతా సిద్దమయ్యారు.
అనుకున్నట్లుగానే లిఫ్ట్ సాయంతో వెళ్లాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి మరికొంత మంది అందులోకి ఎక్కారు. అలా ఎక్కి కొద్దిగా పైకి వెళ్లిందో లేదో వెంటనే పెద్ద శబ్దంతో లిఫ్ట్ కుప్పకూలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సెక్యూరిటి సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇక ఆస్పత్రి సిబ్బంది సాయంతో లిఫ్ట్ తలుపులు తెరిచి వారిని బయటకు దించారు. ఇక ఈ ఘటనలో మేయర్, తదితరులు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.