పులివెందుల- సమైఖ్య ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి వచ్చింది. ఈ మేరకు రెండు నెలలుగా విచారణ చేపట్టిన సీబీఐ కీలక ఆధారాలను సేకరించింది. అందుకు సంబందించి సాక్ష్యాధారాలను సైతం రాబట్టింది. వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు వ్యక్తులను సీబీఐ పలుసార్లు ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్‌మెన్ రంగన్న, ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు లోతుగా విచారించారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్నసీబీఐ విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈమేరకు జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు విచారణలో తేలిందని సమాచారం.
వివేకానంద రెడ్డి హత్యకు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని, హత్య కేసులో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు ప్రధాన సాక్షి రంగన్న చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. వైఎస్ వివేకానంద హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు రంగన్న తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ హత్యకు సంబంచింది ఇద్దరు ప్రముఖ వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది.
వాచ్ మెన్ రంగన్న స్టేట్‌మెంట్ ను అత్యంత రహస్యంగా రికార్డు చేసిన సీబీఐ అధికారులు పలు కోణాల్లో విచారణను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వివేకా హత్య కేసుతో ప్రమేయం ఉన్న ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసుకు సంబందించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.