హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో భారీగా నామినేషన్లు వేయించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆమె ప్రకటించింది. కనీసం 200 మంది నిరుద్యోగులను బరిలో దింపాలని షర్మిల ప్రణాళికలు వేసింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో కనీసం ఒక్క నిరుద్యోగి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.
ఇంకేముంది నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిలను, వారే పట్టించుకోకపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ఎలా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమకోసం పోరాడుతున్నా నిరుద్యోగులు షర్మిలను నమ్మడం లేదని తాజా పరిణామాలతో తెలుస్తోంది. తెలంగాణలో తమ సత్తా ఏంటో నిరూపిస్తామని సభలు, దీక్షల్లో ప్రసంగాలు చేసిన షర్మిల, హుజురాబాద్‌లో పోటీచేసే యువకులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
శుక్రవారంతో హుజురాబాద్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్‌టీపీ మద్దతిస్తున్న నిరుద్యోగి గానీ, ఇండిపెండెంట్ గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయకపోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. తాము నిరుద్యోగుల తరపు పోరాటం చేస్తోంటే, వారు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయకుండా అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని షర్మిల రెండు రోజుల క్రితమే ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది.
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందని వ్యక్తులు అక్కడ పోటీకి చేయాలంటే, నిబంధనల మేరకు స్థానిక ఆర్డీవో వద్ద డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే దీనికి ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడినట్లు వైఎస్సార్‌టీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చినా నిబంధనలను సాకుగా చూపి అడ్డుకున్నారని వైఎస్సార్ టీపీ నేతలు మండిపడుతున్నారు.
ఏదేమైనా హూజూరాబాద్ ఉప ఎన్నికలో తన పార్టీ తరపున ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు నేతలంతా చతికిలపడిపోయారనే చర్చ జరుగుతోంది.