శ్రీకాకుళం- ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు బాగా పెరిగిపోయారు. ప్రేమ ముసుగులో కాలం గడిపి, ఆ తరువాత పెల్లి పేరెత్తేసరికి చాలా మంది మొహం చాటేస్తున్నారు. తాము ప్రేమ పేరుతో మోసగింపబడ్డామని కాస్త ఆలస్యంగా తెలుకున్నాక, కొంత మంది మనస్థానం చెందుతుంటే, మరి కొంత మంది మోసం చేసినవారిపై పోరాటం చేస్తున్నారు.
తాజాగా తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ తరువాత పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక మరో పెళ్లి చేసుకోబోయిన యువతిని అల్లరిపాలు చేశాడో దుర్మార్గుడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి, అతడి ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల మీనా అనే కూతురు ఉంది. ఆమెకు గాజువాకకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పది రోజుల క్రితం మీన తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇచ్చేందుకు గాజువాకలోని వరుడి ఇంటికి వెళ్లగా అతడు పెళ్లికి నిరాకరించాడు
కారణమేంటని ప్రశ్నించగా, గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పరపటి జగదీష్, మీనాల సెల్ ఫోన్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డులను చూపించాడు. అవాక్కైన తల్లిదండ్రులు ఏంజరిగిందని కూతురు మీనాను ప్రశ్నించారు. గతంలో తాను, జగదీశ్ ప్రేమించుకున్నామని, కానీ ఆ తరువాత అతను పెళ్లికి నిరాకరించాడని చెప్పింది. ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లికి చేసుకుంటుండగా, ఆ యువతిని అబాసుపాలు చేసి, పెళ్లిని చెడగొట్టేందుకు ఇలా పెళ్లికొడుకుకు తమ మధ్య జరిగిన ఫోన్ సంబాషనలను పంపించాడు.
దీంతో గ్రామ పెద్దలతో కలిసి పంచాయతీ పెట్టి, మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్‌ను కోరారు. అతను పెళ్లికి నిరాకరించడంతో, జగదీష్ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో అతడు కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని మీనా తేల్చి చెప్పడంతో పోలీసులు సైతం సైలెంట్ అయిపోయారు.