సంగారెడ్డి క్రైం- మహిళలు, ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. పిల్లలను ఎక్కడికైనా పంపాలంటేనే కుటుంబ సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకోబోయింది.
కానీ అదృష్టావశాత్తు దుర్మార్గుల నుంచి ఆ పాప తప్పించుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం చూపిస్తామని నమ్మించి ఇద్దర యువకులు ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. శనివారం ఇద్దరు యువకులు సంగారెడ్డికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశారు. ఆమెతో మెల్లిగా మాటలు కలిపారు. తాము గణేశ్ నిమజ్జనం చూడటానికి వెళ్తున్నామని, అక్కడ పెద్ద పెద్ద గణేషు విగ్రహాలు ఉంటాయని బాలికకు చెప్పారు.
నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆమె సరేనంది. ఆ ఇద్దరు యువకులు బాలికను బైక్‌పై ఎక్కించుకుని జోగిపేట వైపు తీసుకెళ్లారు. కొంచెం దూరం వెళ్లాక మధ్యలో భయపడిన బాలిక తనను ఇంటి వద్ద దించేయాలని కోరగా ఆ యువకులు మాత్రం వినిపించుకోలేదు. ఈ క్రమంలో యువకులు కల్లు తాగేందుకు శివ్వంపేటలో కల్లు దుకాణం వద్ద బైక్ ఆపారు. కల్లు దుకాణం దగ్గర బాలిక ఏడుస్తుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ పాప ఎవరు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ కొంత మంది యువకులను ప్రశ్నించారు.
ఆ బాలిక తమ బంధువని, వినాకయ నిమజ్జనాకి తీసుకెళ్తున్నామని వారు సమాధానం చెప్పారు. యువకుల వైఖరి అనుమానాస్పదంగా అనిపించడంతో స్థానికులు బాలికను ప్రశ్నించగా వారెవరో తనకు తెలియదని, బలవంతంగా తనను తీసుకెళ్తున్నారని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. నిందితులను కందికి చెందిన నగేశ్, సదాశివపేటకు చెందిన సాయిగా గుర్తించామని పోలీసులు చెప్పారు. బాలికను సురక్షితంగా సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించారు. మొత్తానికి బాలిక కిడ్నాప్ ఘటన సంగారెడ్డిలో తీవ్ర కలకలం రేపుతోంది.