ఇంటర్నేషనల్ డెస్క్- మనలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరిలో ఏ టాలెంట్ బయటపడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇక కొంత మంది టాలెంట్ కు సాహసం తోడైతే చెప్పక్కర్లేదు. అద్భుతాలు సృష్టిస్తారు. ఇదిగో పారిస్ దగ్గర ఓ యువకుడు ఇలాంటి సాహసమే చేసి అందరిచేత ఔరా అనిపించాడు.
పారిస్ లోని ప్రసిద్ద ఈఫిల్ టవర్ వద్ద ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే అద్భుతమైన సాహసం చేశాడు. నాథన్ పౌలిన్ అనే రోప్ వాకర్ ఆర్టిస్ట్ ఈ సాహసం చేశాడు. ఈఫిల్ టవర్ మొదటి అంతస్తు నుంచి ట్రోకాడెరో స్క్వేర్ ప్రాంతంలోని ఓ థియేటర్ పైకప్పు వరకు కట్టిన సన్నటి తాడుపై ఏకంగా 600 మీటర్ల దూరం నడిచి అబ్బురపరిచాడు.
మొత్తం 70 మీటర్ల ఎత్తున కేవలం 2.5 సెంటి మీటర్ల సన్ననీ తాడుపై ఆ యువకుడు ఈ సాహసాన్ని ప్రదర్శించాడు. కేవలం తాడుపై నడవడమే కాకుండా, మధ్య మధ్యలో తాడుపై అనేక స్టంట్స్ చేసి అందరిని నాథన్ అలరించాడు. ఇక ఈ సాహసాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు, స్థానికులు వచ్చారు. అతనలా సన్నిని తాడుపై నడుస్తూ వెళ్తుంటే అంతా అలా కళ్లప్పగించు చూస్తుండిపోయారు.
నాథన్ పౌలిన్ చేసిన ఈ అద్భుత సాహసాన్ని అంతా మెచ్చుకున్నారు. అతన్ని ప్రసంశల జల్లులో ముంచెత్తారు. ఈఫిల్ టవర్ దగ్గర ఈ సాహసాన్ని విజయవంతంగా ప్రదర్శించడం తనకు ఓ కలలా ఉందంటూ నాథన్ పౌలిన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ముందు ముందు వినూత్న సాహసాలకు కృషి చేస్తానని చెప్పాడు.