రాజన్న సిరిసిల్ల- ప్రభుత్వ అధికారులపై ప్రజలు ఒక్కోసారి వినూత్న నిరసన తెలియజేస్తుంటారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయిన జనం ఎదురు తిరిగిన సందర్బాలు ఎన్నో చూశాం. ఒక్కో సందర్బంలో ఐతే అధికారులపై దాడులుకు సైతం దిగుతున్నారు. ఇక అధికారులకు లంచం ఇస్తే తప్ప పనులు జరగడం లేదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇదిగో ఇలా లాంచం ఇవ్వకపోవడంతో అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఎలా నిరసన తెలిపిందో చూడండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్ కార్యాలయం గుమ్మానికి తన తాళి బొట్టును కట్టిందో మహిళ. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మంగ, రాజేశం భార్యా భర్తలు. రాజేశం తండ్రి రాజలింగం పేరిట గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. అయితే ఉపాధి కోసం 20 ఏళ్లక్రితం గల్ఫ్ వెళ్లిన రాజేశం తిరిగి రాలేదు. పట్టాదారు అయిన రాజలింగం 2013లో మరణించాడు. గ్రామంలో అప్పులు పెరగడంతో మంగ మెట్‌పల్లి పట్టణంలో నివాసం ఉంటోంది.
ఈ దశలో రాజలింగం పేరిట ఉన్న రెండెకరాల భూమి 2016లో మరో మహిళ పేరు మీదికి బదిలీ అయింది. విషయం తెలుసుకున్న మంగ ఆ భూమికి తన పేరిట పట్టా మార్చాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయితే అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విసుగు చెందిన మంగ లంచం ఇచ్చేందుకు తన వద్ద డబ్బులు లేవంటూ తన తాళిబొట్టును కార్యాలయ గుమ్మానికి కట్టి నిరసన తెలియజేసింది.
అయినప్పటికీ అధికారులు నోరు మెదపలేదు. పైగా ఈ విషయమై తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఐ సునీత వివరణ ఇచ్చారు. దీంతో న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా మాట్లాడితే ఇక తన గోడు వినేదెవరిన మంగ వాపోతోంది. ఉన్నాతాధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లాలని గ్రామస్థులు మంగకు సలహా ఇస్తున్నారు.