నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కరోనాతో భారత్ లో ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా చనిపోతున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా సోకి కోలుకున్నవారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా తగ్గిన వారికి బ్లాక్ ఫంగస్ భయం పట్టకుంది. బ్లాక్ ఫంగస్ కు సరైన మందులు దొరకకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఇదిగో ఇటివంటి సమయంలో బ్లాక్ ఫంగస్ బారిన పడిన తన భర్తను రక్షించుకునేందుకు ఓ భార్య ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండటం కలకలం రేపుతోంది.
ఈ మేరకు ఓమహిళ సోషల్ మీడియాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇండోర్ కలెక్టర్‌ను కూడా ఉద్దేశించి ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను బాంబే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానని.. బ్లాక్ ఫంగస్ సోకడంతో నా భర్తను ఈ ఆసుపత్రిలోనే చేర్పించామని చెప్పుకొచ్చింది. తన భర్తకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోందని ఆవేధన వ్యక్తం చేసింది. ఐతే ఈ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లు లేవని.. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రశ్నించింది. ఈ రోజు తన భర్తకు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది ఆ మహిళ.
తనకు అంతకు మించి మరో మార్గం కనిపించడం లేదని చెప్పింది. దీనిపై స్పందించిన అధికారులు, మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చామని, భర్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మానసిక వేధనతో ఇలా మాట్లాడిందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ సోకిన ఆ మహిళ భర్తకు ఇప్పటివరకు మొత్తం 59 ఇంజెక్షన్లు ఇచ్చామని, మరికొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐతే ప్రస్తుతం తమ వద్ద యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్స్ అందుబాటులో లేవని, త్వరలోనే తెప్పిస్తామని వైద్యులు తెలిపారు.