ప్రేమ.. ఓ మధురమైన భావం. ఆ అనుభూతి మౌనాన్ని మాటగా మార్చగలదు. చీకటి నుండి వెలుగును తీసుకురాగలదు. భయాన్ని దైర్యంగా చేయగలదు. ఓ సాధారణ ఆడపిల్లని తన మనసైన వాడి కోసం అడవుల్లోకి పరుగులు తీపించగలదు. తుపాకీ చప్పుళ్లను ఎదిరించగలదు, అన్నీటికి మించి ప్రేమించిన వాడి కోసం చావునైనా ఎదిరించేలా చేయగలదు. ఇదేదో విరాటపర్వం సినిమాలా ఉంది అంటారా? మీరు ఊహించింది వందకి వంద శాతం నిజం.
విరాటపర్వం సినిమాలోని సాయిపల్లవి క్యారెక్టర్ ఇదే. కానీ.., మీకు తెలుసా? ఈ క్యారెక్టర్ ని ఓ మహిళ నిజ జీవితం నుండి స్ఫూర్తిగా తీసుకున్నారని? ఆమె పేరు జజ్జర్ల సమ్మక్క. ఆమె బావ పేరు యాప నారాయణ. అలియాస్ హరిభూషణ్. ఈరోజుల్లోలా.. సోమవారం మొదలై.., ఆదివారంతో ముగిసిపోయే ప్రేమ కాదు జజ్జర్ల సమ్మక్కది. ఆమెకి తన బావ యాప నారాయణ అంటే ప్రాణం. చిన్ననాటి నుండి ఆమెకి బావ తప్ప మరో లోకం తెలియదు. కాలేజీ చదువుల కోసం తన బావ మన్యం దాటి.. టౌన్ కి వెళ్తేనే గుండెలు పగిలేలా ఏడ్చినంత ప్రేమ ఆమెది. డిగ్రీ పట్టా చేతికి అందాక తన బావ వచ్చి.., తన మెడలో మూడు ముళ్ళు వేస్తాడని జజ్జర్ల సమ్మక్క కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది. కానీ.., విధి రాత ఇంకోలా ఉంది.
హన్మకొండలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. యాప నారాయణ రాడికల్ స్టూడెంట్ యూనియన్ పట్ల ప్రభావితుడిఫై దళంలో చేరిపోయాడు. ఇందుకోసం మరదలిపై తనకున్న ప్రేమని కూడా త్యాగం చేశాడు. అలా యాప నారాయణ 1991లో మావోయిస్టు సభ్యుడు అయిపోయాడు. కానీ.., ఇక్కడ జజ్జర్ల సమ్మక్కకి తన బావ అంత విశాల హృదయం లేదు. ఆమెకి తెలిసింది బావ ఒక్కడే, బావపై పెంచుకున్న ప్రేమ ఒక్కటే. తన బావ ఎక్కడ ఉంటే అక్కడే తనకి బ్రతుకు అనుకుంది సమ్మక్క. ఇందుకోసం సమాజాన్ని ఎదురించింది. ఇంటి గుమ్మం దాటి తన బావని వెతుక్కుంటూ అడవి బాట పట్టింది. అడవిలో ముళ్ళని, రాళ్ళని మాత్రమే కాదు.., జీవితంలో ఉండే సుఖాలు, సంతోషాలను కూడా దాటి.., తన ప్రపంచమైన బావని ఆ అడవిలోనే పెళ్లి ఆడింది సమ్మక్క. అలా.. ఆమె కూడా మావోయిస్టు సభ్యురాలు అయిపోయింది.
ఆనాటి నుండి ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో తన బావ హరిభూషణ్ వెంటే నడించింది జజ్జర్ల సమ్మక్క. కష్టాలు, కన్నీళ్లు, చట్టాలు, తూటాలు, బంధాలు, బంధువులు ఏవి కూడా వీరిని వేరు చేయలేకపోయాయి. 2008లో ఓసారి జజ్జర్ల సమ్మక్కకి ఆరోగ్యం చెడిపోయింది. వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అవసరమైన ఆపరేషన్ చేయించుకుంది. ఆ కుట్ల పచ్చి కూడా తగ్గకుండానే మళ్ళీ తన బావని వెతుక్కుంటూ అడవి బాట పట్టింది జజ్జర్ల సమ్మక్క. బావ అంటే అంత ప్రేమ ఆమెకి.
ఇలా ప్రపంచంలో ఏ శక్తి వీరిని వేరు చేయలేకపోయింది. కానీ.., గత కొన్ని రోజుల క్రితం జజ్జర్ల సమ్మక్క బావ హరిభూషణ్ కి అడవిలో కరోనా సోకింది. సమ్మక్క తనకి చేతనైన సేవలు అన్నీ చేసింది. కానీ.., అతను బతకలేదు. తన ప్రాణానికి ప్రాణం అయిన బావ చనిపోవడంతో సమ్మక్క కూడా ఆ మహమ్మారి దెబ్బ నుండి కోలుకోలేకపోయింది. ఆమె కూడా కరోనా కారణంగా కుప్పకూలింది. వీరి మరణ వార్తని ఇప్పటికే పోలీసులు ధ్రువీకరించారు. బ్రతికినంత కాలం చావుని ఎదిరించి నిలిచిన సమ్మక్క ప్రేమ.. చావులో కూడా విజయమే సాధించింది. మన్యంలో మొదలైన వీరి ప్రేమ.., దండ కారణ్యంలో ఇలా ముగిసింది అనమాట. సైద్ధాంతిక పరంగా వీరు చేసింది తప్పా, ఒప్పా అన్న విషయాలను పక్కన పెడితే వీరి ప్రేమ మాత్రం నిజంగా అజరామరం.