కొన్ని సార్లు చాలా చిన్న ఐడియాలే తల పట్టుకునేలా చేసిన సమస్యలను తీరుస్తాయి. గండం నుంచి గట్టెక్కిన తర్వాత ఓర్నీ ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనే గురువారం నగరంలో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలు చేసేందుకు గణపతిని ప్రతిష్ఠించేందుకు బోరబండకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ఓ భారీ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో బోరబండకు తరలిస్తుండగా.. ఈఎస్ఐ వద్ద గర్డర్ దాటలేక ఇరుక్కుపోయింది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ఎంత ప్రయత్నించినా వినాయకుడి విగ్రహం ముందు కదల్లేదు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఏం చేయాలో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ఇంతలో ఎవరికో తట్టిన ఓ చిన్న ఐడియా ఆ సమస్యను తీర్చింది. గర్డర్ కు పైన కొద్దిగానే విగ్రహం తగులుతుండంతో డీసీఎం వాహనం టైర్లలో గాలితీశారు. అంతే గణేష్ మహారాజ్ కు రూట్ క్లియర్ అయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.