‘ఐడా’ తుపాన్ అమెరికాలోని పలు నగరాలను వణికించింది. వరద తీవ్రత ప్రమాదకరంగా ఉండటంతో న్యూయార్క్ , న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి విధించారు. రికార్డ్ స్థాయిలో కురిసిన మెరుపు వర్షాలకు ఇప్పటివరకూ 41 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు గల్లంతైనట్లు పేర్కొన్నాయి. ‘ఐడా’ హరికేన్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాలు భయంతో వణుకుతున్నాయి. ‘ఐడా’ బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోక ముందే పెను తుఫాను ప్రభావం న్యూయార్క్, న్యూ జెర్సీలపై పడగవిప్పింది. భారీ వరదలతో న్యూయార్క్, దాని పరిసరాల్లో ఒక్క రోజులోనే కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ నగరంలో 11 మంది, న్యూజెర్సీ రాష్ట్రంలో 23 మంది చనిపోయారు. కింది అంతస్తుల్లో నివసిస్తున్నవారు వరదలకు పలువురు కొట్టుకుపోయారు. న్యూయార్‌లో ‘ఆకస్మిక వరదల అత్యవసర స్థితి’ని అమెరికా ప్రకటించింది.
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మేరీలాండ్, పెన్సిల్వేనియా, వర్జీనియా ఇలా ఆరు రాష్ట్రాలు నీట మునిగాయి. వరదల వల్ల ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. కాలనీలు నదులుగా మారాయి. కార్లు పడవల్లా మారి వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్లాట్ ఫామ్స్, ట్రాక్స్ పైకి భారీగా వరద నీరు చేరడంతో సబ్ వేలను క్లోజ్ చేశారు. రైళ్లు, బస్సులు వరదనీటితో నిండిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. బేస్ మెంట్ ఏరియాలు వరద నీటితో నిండిపోయాయి.
న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలూ బీభత్సం సృష్టించాయి. న్యూజెర్సీలోని 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావచ్చని పేర్కొంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ భారీ వరదలు సంభవించాయి. తుఫాను కారణంగా లూసియానా రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇప్పటికీ పునరుద్ధరించలేదు.
ది న్యూయార్క్ టైమ్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో అక్కడి కష్టాల్ని కళ్ళకి కట్టీనట్లు చూపుతోంది:
Watch: The New York area was under a state of emergency on Thursday after the remnants of Hurricane Ida led to at least 14 deaths and disrupted subway service. Across the city, New Yorkers documented the scene as flood waters overwhelmed buses and subways. https://t.co/spVsdgF0XX pic.twitter.com/r2vg2aDRVg
— The New York Times (@nytimes) September 2, 2021