మనకు 10 రూపాయాల నాణేలపై అనేక అపోహలున్నాయి. నిజం ఎంటో తెలియకుండానే 10 రూపాయాల కాయిన్స్ చెల్లవు అని కొందరు తీసుకోవడం మానేస్తుంటారు. ఆటో ఎక్కి.. దిగిన తర్వాత రూ.10 కాయిన్ ఇస్తే.. ఇది చెల్లదు అని ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వినిపిస్తోంది. చాలా చోట్ల ఇదే ఆన్సర్ వినిపిస్తుంది. మనకు అవగాహన ఉండి.. రూ.10 నాణేలు చెల్లుతున్నాయి అని అన్నా కూడా.. ఏమో మా దగ్గర ఎవరూ తీసుకోవడం లేదని.. అందుకే మేమూ తీసుకోవడం లేదని అంటుంటారు. అయితే తాజాగా ఓ ఎంపీ అడిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి రూ.10 నాణేలపై క్లారిటీ ఇచ్చారు.
రూ.10 నాణేల చెల్లుబాటు అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. రూ. 10 నాణెం చెల్లుతుందా.. చెల్లదా? అని తమిళనాడు చెందిన ఎంపీ విజయకుమార్ రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఎంపీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. దేశంలో రూ.10 నాణాలు చెల్లుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వాటిని RBI ముద్రించి చెలామణిలో ఉంచిందని వెల్లడించారు. అన్ని లావాదేవీలకు వీటిని వినియోగించవచ్చని ఆయన అన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నట్లు మంత్రి రాజ్యసభ సాక్షిగా తెలియజేశారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.