రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకం దళితబంధు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దత్తర గ్రామం వాసాలమర్రి హుజూరాబాద్ నియోకవర్గాల్లో పైలెట్ పద్దతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. అలానే ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ నాలుగు మండలాల్లో కూడా ఈ పథకం అమలవుతోంది.
ఈ క్రమంలో దళితబంధుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతుండగా.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దళితబంధు అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. ఈ క్రమంలో 118 నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి : దళిత బంధు కోసం ఒక లక్ష కోట్ల రూపాయలు- సీఎం కేసీఆర్
ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘118 శాసనసభ నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి. మార్చి నెలలోగా ఆయా నియోజకవర్గాల్లో 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలి. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే సలహాతో లబ్ధిదారుని ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులతో ఆమోదింపచేసుకోవాలి’’ అని తెలిపారు.
‘‘ప్రతి లబ్ధిదారుడికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ. 10 లక్షల ఆర్ధిక సాయంతో కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలి. ఒక్కో లబ్ధిదారుడికి మంజూరైన 10 లక్షల రూపాయల నుంచి రూ. 10 వేలతో దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1200 కోట్లు కేటాయించాం. అందులో ఇప్పటికే రూ. 100 కోట్లు విడుదల చేశాం. మిగతా మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తాం’’ అని సీఎస్ తెలిపారు.
ఇది కూడా చదవండి : దళిత బంధుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా…!