స్పెషల్ డెస్క్- కలిసి ఉంటే కలదు సుఖం.. కలిసి సమిష్టిగా కృషి చేస్తే విజయం తధ్యం. దీన్ని అక్షరాల నిరూపించారు ముగ్గురు స్నేహితులు. చదువుకునే టైంలో ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు ఇప్పుడు ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భాను ప్రతాప్, ఫరీద్, అంకుష్ 2011-2015 మధ్య కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. ముగ్గిరిది ఉత్తర్ ప్రదేశ్ అయినా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. భానుది గోరఖ్‌పుర్, ఫరీద్‌ది లఖ్‌నవూ కాగా అంకుష్‌ది ఘజియాబాద్. ఈ క్రమంలో క్యాంపస్ లో యాహూ సంస్థ హ్యాక్ యు అనే హ్యాకధాన్ ను నిర్వహించింది. అప్పుడు ఈ ముగ్గురు వేరు వేరుగా పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఇక్కడే ఈ ముగ్గురికి పరిచయం కాగా.. ఆ తరువాత మంచి స్నేహితులు అయ్యారు.
తర్వాత తమ ఐఐటీ టెక్‌ఫెస్ట్‌లలో బృందంగా పోటీకి వెళ్లి ఎన్నో బహుమతులు గెలిచారు వీళ్లు. నిర్భయ సంఘటన తర్వాత దిల్లీలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ డేటాని క్రోడీకరించి ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలిపే టెక్నాలజీని అభివృద్ది చేసి పోలీసులకు అందించారు. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉండగానే అద్దెకూ, అమ్మకానికీ అందుబాటులో ఉండే ఇళ్ల వివరాలతో మొహల్లా డాట్‌కామ్ ను ప్రారంభించారు. తర్వాత క్యాంపస్ లోనే సుమారు 13 ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తుల్ని అభివృద్ది చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో 2015లో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ముగ్గురికీ మంచి ఉద్యోగాలు వచ్చినా ఒక్కరు కూడా జాబ్స్ లో మాత్రం చేరలేదు. అప్పటికే వాళ్లు అభివృద్ది చేసిన షేర్‌చాట్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ముగ్గురు. చదువు అయిపోగానే గోరఖ్ పూర్ ఐఐటీ క్యాంపస్ నుంచి నేరుగా బెంగళూరు కు వచ్చి షేర్ చాట్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఉండే ఫీచర్లను ఒకే ఆప్ లో తేవాలన్న ఆలోచన నుంచి వచ్చిందే షేర్ చాట్. ఇది అన్ని ప్రాంతీయ భాషల్లో ఉండేలా డెవలప్ చేశారు. మొత్తం 15 భారతీయ భాషల్లో సమాచారాన్ని సృష్టించే, పంచుకునే విధంగా షేర్ చాట్ ను అభివృద్ది తేశారు. షేర్‌చాట్ కు పెద్ద సంఖ్యలో డౌన్ లోడ్లు వస్తున్నా, కేవలం భారతీయుల సోషల్ నెట్‌వర్క్ అన్న కారణంతో మొదట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ఆసక్తి చూపలేదట. ఈ క్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనీ ఉపయోగించి సందేశాలను.. ప్రాంతం, కేటగిరీల వారీగా పంపించడంద్వారా షేర్‌చాట్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో జియామీ, ట్విటర్ సంస్థలు షేర్ చాట్ లో పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీలో ముగ్గురికి సమాన వాటా ఉండగా, అంకుష్ సీఈఓ, భాను సీటీఓ, ఫరీద్ సీఓఓ గా ఉన్నారు.
ఇలా షేర్ చాట్ విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో భారత్ లో భారత్‌లో టిక్ టాక్ ను నిషేధించడం ఈ ముగ్గురు స్నేహితులకు కలిసి వచ్చింది. టిక్ టాక్ లాంటి వీడియో షేరింగ్ యాప్ ను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా కేవలం 30 గంటల్లో ఓ ఆప్‌ని తయారు చేశారు. అలా రూపొందించిందే మోజ్ సోషల్ మీడియా యాప్. అతి తక్కువ కాలంలోనే మోజ్ బాగా పాపులర్ అయ్యింది. మొత్తం 15 ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ మోజ్ అందుబాటులో ఉంది. వకేవలం సంవత్సర కాలంలోనే 13 కోట్ల డౌన్‌లోడ్లతో మోజ్ రికార్టు నెలకోల్పింది. ప్రస్తుతం షేర్ చాట్, మరియు మోజ్ ఈ రెండు ఆప్‌లకూ సుమారు 30 కోట్ల మంది వినియోగదారులున్నారు. వచ్చే అయిదేళ్లలో 100 కోట్ల మంది వినియోగదారులను చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ అక్షరాల 15 వేల కోట్ల రూపాయలు. మొదట్లో వైఫల్యాలను చవిచూసిన మేము.. ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు ఈ ముగ్గురు స్నేహితులు. అన్నట్లు ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు.