హైదరాబాద్- రోజు రోజుకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో దేశంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. అందులోను న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తాంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను కఠినతరం చేశాయి.
ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో ను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపధ్యంలో కరోనా ఆంక్షలను విధిస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందు బాబులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. కొత్త సంవత్సర వేడకలకు మరింత వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ప్రతి రోజూ మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరచి ఉండగా, డిసెంబర్ 31న మరో గంట సమయం పెంచుతూ 12 గంటల వరకూ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లు, న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్స్‌కి అనుమతినిచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్స్, బార్లు, టూరిజం హోటల్స్‌కి రాత్రి ఒంటి గంటల వరకూ అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐతే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సమయం వరకే వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు, మరో వైపు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తారని అంతా భావించిన సమయంలో, ఇలా ప్రత్యేక ఆఫర్ ఇవ్వడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.