విజయవాడ- రాచరికపు పాలనలో ప్రజలు రాజ్యం గురించి, పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు స్వయంగా రాజులే మారువేశంలో వెళ్లేవారట. అలా ప్రజలతో మాట్లాడి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల వరకు చేరుతున్నాయా, లేదా అని వారినే అడిగి తెలుసుకునేవారు. ఇక ప్రజల్లో తమ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా చక్రవర్తులు మారువేశాల్లో వెళ్లి అడిగి గ్రహించేవారు.
ఇక ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోను ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం అప్పుడప్పుడు మారు వేశాల్లో వెళ్తున్నారనుకొండి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఓ ఉన్నతాధికారి ఇలాగే మారువేశంలో వెళ్లి రైతులకు జరుగుతున్న మోసాలను బయటపెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పాత లుంగీ, మామూలు చొక్కా, మెడలో టవల్.. ఇవన్నీ చూసి అంతా ఎవరో పేద రైతు అనుకున్నారు. ఆయన నేరుగా ఎరువుల, పంటల పురుగు మందులు అమ్మే దుకాణాల్లోకి వెళ్లారు. రైతులాగే ఎరువులు, పరుగు మందుల ధరలు అడిగాడు.
ఎలాగూ కొనడానికే వచ్చాడు, చూస్తే చదువు రానివాడిలా ఉన్నాడని మామూలు ధరల కన్నా ఎక్కువ ధరలు చెప్పారు. ఇలా రెండు మూడు ఎరువుల దుఖాణాలు తిరిగి వారి మోసాన్ని ప్రత్యక్ష్యంగా తెలుకుని అప్పుడు ఆయన అసలు రూపాన్ని బయటకు తీశారు. వెంటనే తన అధికార యంత్రాగమంతా వచ్చేశారు. ఇంకేముంది ఆయా ఎరువుల దుఖాణాలన్నీ సీజ్ చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు.
ఇంతకీ ఇలా మారువేషంలో వచ్చంది ఎవరనుకుంటున్నారు.. సాక్షాత్తు విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఆయనను చూసు ఎరువుల షాపుల వాళ్లే కాదు స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంకేముంది ఇప్పుడు వ్యాపారుల్లో వణుకు మొదలైంది. ఏ రైతు రూపంలో ఏ అధికారి వస్తారోనని భయంతో చస్తున్నారు. ఇలాంటి అధికారులు కొంతమంది అయినా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అందరు కామెంట్ చేస్తున్నారు.