ఓ ఇద్దరు కలిసి ఏదైనా తినాలనిపించి, తాగాలనిపించినా ఓ రెస్టారెంట్ కు వెళ్లి.. ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నామనుకుందాం. ఓ పెద్ద రెస్టారెంట్ లో అయితే 3 నుండి 5 వేలు బిల్లు చేస్తాం. అదే ఏదైనా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్రూట్ జ్యూస్ లు తాగితే మహా అయితే రెండు వేలు లోపు బిల్లు ఉంటుంది. కానీ కేవలం రెండు కాఫీలకే లక్షల్లో వసూలు చేస్తే.. పరిస్థితి ఏంటంటారు..
పొద్దునే లేవగానే ఓ టీనో, కాఫీనో పడితే కానీ మనకు తెల్లారినట్లు కాదు. ఇక పని ఒత్తిడి అనిపించినా, కొంచెం మనసు బాగోలేదని అనిపించగానే మొదట గుర్తుకు వచ్చే ఆప్షన్ కాఫీ. ఇంట్లో ఉంటే అమ్మనో, భార్యనో చేస్తే హ్యాపీగా తాగేస్తారు. ఇక ఆఫీసులకు, బయటకు వెళితే.. ఏ కాఫీ షాపులనో ఆశ్రయిస్తుంటారు. వీటిల్లో కూడా రకాలున్నాయి. చిన్న బడ్డీ కొట్టు దగ్గర ఓ ధర ఉంటే, ఓ మోస్తారు టీ స్టాళ్లతో మరో ధర ఉంటుంది. ఇక రెస్టారెంట్లకు వెళితే.. కాఫీని బట్టి ధరలు ఉంటాయి. కాఫీ తాగుదామని స్టార్ రెస్టారెంట్‌కు వెళ్లిన జంట రెండు కాఫీలు ఆర్డర్ చేసి, తాగిన తర్వాత బిల్లును చూసి, అవాక్కయ్యారు.
రెండు కాఫీలకు గానూ ఆ రెస్టారెంట్ వేసిన బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా నాలుగు వేల డాలర్లకు పైమాటే. మన కరెన్సీలో 3,66,915 రూపాయలన్నమాట. అమెరికాలోని ఓ జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కాఫీకి వెళితే వారి బ్యాంక్ బాలెన్స్ మొత్తం దోచేసిందీ సదరు సంస్థ. ఇంతకు ఆ రెస్టారెంట్ పేరేమిటంటే స్టార్ బక్స్. అమెరికాకు చెంది జెస్సీ, డీడీ ఒడెల్ కాఫీలు తాగేందుకు స్టార్ బక్స్ కు వెళ్లారు. రెండు కాఫీ ఆర్డర్ చేసి బిల్ పే చేసి కార్డు ద్వారా డబ్బులు చెల్లించి వచ్చేశారు. కొన్నిరోజుల తర్వాత భార్య, భర్త, పిల్లలను తీసుకుని షాపింగ్ కు వెళ్లారు. అంతా అయిపోగానే బిల్లు చెల్లించేందుకు కార్డును ఇవ్వగా తగినంత నగదు లేదని చూపిస్తోంది.
మళ్లీ మళ్లీ ప్రయత్నించగా.. అలానే చూపిస్తుండటంతో.. ఇప్పుడు వస్తానని చెప్పి డీడీ ఒడెల్ ఆ కార్డును తీసుకుని బయటకు వెళ్లి చెక్ చేశారు. సరిగ్గా తనిఖీ చేయగా.. స్టార్ బక్స్ నుండి 4,444.44 డాలర్లు వసూలు చేసినట్లు గుర్తించారు. తాము గత 16 సంవత్సరాల నుండి కాఫీ తాగుతున్నామని, అయితే కేవలం 9 నుండి 10 డాలర్లు మాత్రమే అయ్యేదని జెస్సీ చెప్పారు. ఈ సమస్యను మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా.. తప్పును గ్రహించిన ఆయన నెట్ వర్క్ సమస్య ఉన్నట్లు చెప్పారు. అయితే సమస్య కచ్చితంగా తెలియదని, పరిష్కరిస్తామని తెలిపారు. అయితే ఇందులో మానవ తప్పిదం ఉందని భావిస్తున్న సంస్థ ఆ జంటకు ఆ డబ్బు మొత్తాన్ని రెండు చెక్కుల రూపంలో అందజేసిందని సమాచారం.