నేషనల్ డెస్క్- కరోనా లక్షణాలు కనిపించగానే అందరిలో కంగారు మొదలవుతుంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే చాలా మందికి భయం. స్వాబ్ టెస్ట్ బడ్ ను ముక్కులోకి, గొంతులోకి పెట్టి స్వాబ్ ను కలెక్ట్ చేస్తారు. దీంతో చాలా మంది కరోనా పరీక్ష అంటేనే వణికిపోతున్నారు. పైగా కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే.. మనకు కరోనా లేకున్నా వేరే వాళ్ల నుంచి ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం కూడా చాలా మందిలో ఉంది. ఇక ఇప్పుడు అలా భయపడాల్సిన పనిలేదు. కరోనా పరీక్షా కంద్రాలకు వెళ్లి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఎంచక్కా ఇంట్లోనే ఉండి మనమే కరోనా పరీక్ష చేయించుకోవచ్చు. ఇంట్లోనే ఎవరిక వారు కరోనా పరీక్ష చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి బుధవారం అనుమతి ఇచ్చింది.
కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారు మాత్రమే ఈ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ సంస్థ రూపొందిన ఈ కొవీసెల్ఫ్ కిట్‌ను పరీక్షించి అనుమతించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ముక్కులో నుంచి తీసిన స్వాబ్ తో పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కిట్ తయారు చేసిన మైలాబ్ డిస్కవరీ యూజర్ మాన్యూవల్‌లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐతే అవసరం లేకున్నా విచ్చలవిడిగా, ఎవరు పడితే వారు ఈ కిట్ తో కరోనా పరీక్షలు నిర్వహించకూడదని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఈ యాంజిజెన్ కిట్‌తో సోంతంగా చేసుకున్న పరీక్షలో పాజిటివ్‌గా తేలితే వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని తెలిపింది.
వారికి మళ్లీ పరీక్షా కేంద్రాల్లో టెస్టులు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐతే కరోనా లక్షణాలు ఉండీ ఈ కిట్ ద్వార చేసిన పరీక్షలో నెగిటివ్ వస్తే మాత్రం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్షా కేంద్రాల్లో ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వైరల్ లోడ్ తక్కువగా ఉన్న కొన్ని సందర్బాల్లో యాంటిజెన్ పరీక్షల్లో బయటపడకపోవచ్చని స్పష్టం చేసింది. ఇక మైల్యాబ్ డిస్కవరీ హోం టెస్టింగ్ కిట్ కొవీసెల్ఫ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలోంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఐతే ఈకిట్ మార్కెట్లోకి అందుబాటులోకి రావడావికి మాత్రం మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ఈ కిట్ ధరను 250 రూపాయలుగా నిర్ధారించారు.