ద్వారకా తిరుమల- సమాజంలో ఒక్కోసారి కొంత మంది మునుషులు మానవత్వం మరిచిపోతారు. కనీసం కనికరం లేకుండా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అవతలి వారు ఎంతలా బాధపడతారన్న ఇంగితం కూడా వాళ్లకు ఉండదు. పశ్చిమ గోధావరి జిల్లాలో మహిళలన్న కనికరం కూడా లేకుండా దారణంగా ప్రవర్తించారు కొందరు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. చిన వెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో చితకబాదారు. వారి దెబ్బలు తాళ్లలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. ఆలయానికి వచ్చిపోయే భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారనే కారణంతో మహిళా యాచకులను భద్రతా సిబ్బంది మోకాళ్లపై నిలబెట్టి, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ద్వారకా తిరుమలలోని శివాలయం దగ్గర ఈ దారుణం జరిగింది.
శివాలయానికి భక్తులు వస్తుంటే వారికి ఇబ్బంది కలిగించే విధంగా మహిళా యాచకులు భిక్షాటన చేస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్న యాచకులందరినీ సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో బాదుతూ ఒక దగ్గరకు తీసుకొచ్చారు. మహిళలని కూడా చూడకుండా వారందరిని మోకాళ్లపై కూర్చొబెట్టి మరీ కొట్టారు.
తమను విడిచిపెట్టాలని, తాము అక్కడి నుంచి వెళ్లిపోతామని బతిమాలినా కనికరం చూపకుండా సెక్యూరిటీ సిబ్బంది కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరును భక్తులు సైతం తప్పుబట్టారు. ఐతే భక్తులను ఇబ్బంది కలిగిస్తున్నారనే వాళ్లను మందలించామని దేవస్థానం భద్రతా విభాగం అధికారి చెప్పారు. మోకాళ్లపై యాచకులను నిలబెట్టినందుకు తాము భద్రతా సిబ్బందిని మందలించామని వివరణ ఇచ్చారు.
ఆలయానికి భక్తులు వస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ అడ్డుకుంటున్నారని, గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదని సదరు అధికారి తెలిపారు. ఆలయ పరిసరాల్లో స్వీపర్లుగా ఉద్యోగం ఇస్తామని చెబితే వారు నిరాకరించారని చెప్పారు. ఏదేమైనా ఇలా మహిళలను మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టడంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.