ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాపై ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పోరాట యోధులు కొమురమ్ భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, శ్రియ శరన్ తదితర భారీ తారాగణం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియూన్ మూవీగా వస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకనకు సంబంధించిన తాజా అప్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాతి సందర్బంగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ను రాజమౌళి బృందం త్వరలో ప్రారంభించబోతున్నారట.
ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్ లో అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఐతే దీనిపై అప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ దుబాయ్ లోనే ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారని మాత్రం ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ జరుగుతోంది.