వరంగల్- హైదరాబాద్ లోని సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన తరువాత సుమారు వారం రోజుల నుంచి తప్పించుకు తిరిగిన రాజు, అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖం ఛిద్రం కావడంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి చనిపోయింది రాజేనని నిర్ధారించారు. పోలీసులు తన కోసం గాలిస్తుండటంతో భయపడి నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, రాజు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపించి అతనిదేనని నిర్ధారించుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు నుంచి రాజు కుటుంబ సభ్యులను రప్పించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహం రాజుదేనని కుటుంబ సభ్యులు నిర్ధారించిన తరువాత, కాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఐతే రాజు మృతదేహాన్ని అడ్డగూడూరు తీసుకెళ్ళి దహనం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు రాజు మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకెళ్లకుండా, వరంగల్ నగరంలోని పోతన కాలనీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
కట్టెలపై పేర్చిన రాజు చితికి తల్లి వీరమ్మ నిప్పంటించారు. నిందితుడు రాజు మృతదేహం చితిమంటల్లో కాలిబూడిదైంది. కడుపున పుట్టిన బిడ్డ చితిపై కాలిపోతుండడంతో తల్లి వీరమ్మ, పెళ్లి చేసుకున్న పాపానికి భార్య కన్నీరుమున్నీరయ్యారు. మొత్తానికి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన రాజు కధ ముగిసింది. రాజు ఆత్మహత్యపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజును పోలీసులే చంపారని కుటుంబ సభ్యులు ఆరోోపిస్తున్నారు.