చెన్నై- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయనను గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రజనీకాంత్ ను ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలో ఉప రాష్ట్రపతి నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత మంగళవారం రాత్రి రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచి కాస్త నీరసంగా ఉన్నారని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న ఆయన అంతలోనే ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
సోషల్ మీడియాలో రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని, తీవ్ర అస్వస్థత గురయ్యారని ప్రచారం జరుగుతోంది. దీనిపై రజనీకాంత్ సతీమణి లత స్పందించారు. రెగ్యులర్ గా నిర్వహించే సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆయన కావేరీ ఆస్పత్రికి వెళ్లారని, అంతకు మించి ఏమీ లేదని ఆమె చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లత స్పష్టం చేశారు.
గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో రజనీకాంత్ కు తీవ్రమైన తలనొప్పి వచ్చిందట. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ లో రజనీకాంత్ కు ఎంఆర్‌ఐ స్కాన్ తీయగా, రక్తనాళం పగిలినట్లు గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్యులు రజనీకాంత్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.