ఉరి చివర పొదల్లో, గుట్టల్లో తొండలు గుడ్లు పెట్టడం చాలా సాధారణం. ఇవే కాక.., చిన్న చిన్న పక్షులు, జీవులు జనావాసం లేని ప్రాంతాల్లోనే గుడ్లు పెడుతాయి. నిజానికి ఆ గుడ్ల సైజు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ.., చిన్న సైజు ఫుట్ బాల్ అంత గుడ్డు కనిపిస్తే ఎవరికైనా కాస్త భయం కలగడం ఖాయం. కృష్ణా జిల్లా పొట్టిపాడు గ్రామంలో ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పొట్టిపాడు గ్రామంలో గత కొంత కాలంగా కొండచిలువ పిల్లలు కనిపిస్తూ వచ్చాయి. గ్రామస్థులు ఎన్ని పాము పిల్లలను చంపినా.., ఇంకా అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో.., అప్రమత్తం అయిన గ్రామస్థులు దీని మూలాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
అంతా కలసి ఆ పాము పిల్లలు ఎటు వైపు నుండి వస్తున్నాయో వెతకడం ప్రారంభించారు. ఇలా వెతుకుతున్న వారికి ఉరి చివర వాగు గట్టుపై ఉన్న ఓ చెట్టు తొర్రలో భారీ గుడ్లు కనియించాయి. గ్రామస్థులు అంతా కలసి పదుల సంఖ్యలో ఆ గుడ్లను బయటకి తీశారు. ఇదే సమయంలో పోలీసులకి కూడా సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ గుడ్లని పగలకొట్టి చూడగా వాటిల్లో నుండి కొండచిలువ పాము పిల్లలు బయటకి వచ్చాయి. వచ్చిన పాముని వచ్చినట్టు గ్రామస్థులు కొట్టి చంపేశారు. ఒకే దగ్గర అన్ని పాములుని చూసి పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు.
ఆ ప్రదేశంలో స్థానికులు మరి కాస్త లోతుగా తవ్వి చూడగా.. చెట్టు తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్న కొండచిలువ ఇక్కడే పెద్ద మొత్తంలో గుడ్లు పెట్టినట్లుగా గుర్తించారు. కొండచిలువ కోసం ఎంత వెతికినా అది కనిపించలేదు. పోలీసులు అప్పటికే అటవిశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఎన్నో ఏళ్లనాటి భారీ వృక్షం కావడంతో.. దాని వేర్లకింద కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొండచిలువలు తనకి సరిపోయే భారీ ఆహరం దొరికే వరకు నివాస స్థలాన్ని చేరుకోవని, ఈ ప్రదేశాన్ని నిఘా వేసి ఉంచితే త్వరలోనే ఆ కొండచిలువని పట్టుకోవచ్చని అటవీశాఖ అధికారులు తెలియచేశారు. ఏదేమైనా ఓ భారీ ప్రమాదం తప్పడంతో కృష్ణా జిల్లా పొట్టిపాడు గ్రామస్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు.