హుజూరాబాద్– రాజకీయాల్లో చిన్న అవకాశం దొరికితే చాలు అపోజిషన్ పార్టీని చెడుగుడు ఆడుకోవడం సహజం. ఇక అదే ఎన్నికల సమయంలో ఐతే ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై ఒకరు చెడామడా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటారు. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఇదిగో ఇటువంట సమయంలో టీఆర్ ఎస్ పార్టీ సమావేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ఎన్నికల ప్రచార సభకు మంత్రి వచ్చాడని, అక్కడ మాట్లాడుతున్న మరో దళిత మంత్రి చేతిలో నుంచి మైక్ లాక్కున్న సంఘటన వైరల్ అవుతోంది. ఆర్ధిక మంత్రి హరీశ్ రావు వచ్చాడని సాటి మంత్రి చేతిలోని మైక్ లాగేసుకున్న ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హరీశ్ రావుకి స్వాగతం చెప్పేందుకు దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ని దారుణంగా అవమానించారని, ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకు అంటూ బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐపీఎస్ అధికారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సభలో దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతుండగా, అప్పుడే మంత్రి హరీశ్ రావు స్టేజీపైకి వచ్చారు. ఇంకేముంది పక్కనున్న ఓ వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలోని మైక్‌ని లాగేసుకుని మరీ మంత్రి హరీశ్‌కి స్వాగతం చెప్పడం ఆసక్తికరంగా మారింది. హరీశ్ రావు వచ్చాడని సాటి మంత్రి, అందులోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి చేతిలో నుంచి మైక్ లాక్కోవడం సంచలనం రేపుతోంది.
మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద నుంచి మైక్ లాక్కుంటున్న వీడియోను షేర్ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకెంతకాలం ఈ అవమానాలు భరిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొప్పుల ఈశ్వర్ గారూ, కనీస సంస్కారం లేని దొరల గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు.. ఐదు సార్లు ఎమ్మెల్యే ఐన మీ గుండె ఎన్ని సార్లు గాయపడ్డదో మీతో కలసి పనిచేసిన నాకు తెలియంది కాదు.. అందుకే గడీలలో బందీలైన సమస్త బహుజననాయకుల్లారా, ఇకనైనా బానిసత్వ సంకెళ్లు తెంపుకోండి.. అంటూ ప్రవీణ్ కుమార్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
@Koppulaeshwar1 గారూ, కనీస సంస్కారం లేని దొరల-గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు? ఐదు సార్లు MLA ఐన మీ గుండె ఎన్ని సార్లు గాయపడ్డదో మీతో కలసి పనిచేసిన నాకు తెలియంది కాదు. అందుకే గడీలలో బందీలైన సమస్త బహుజననాయకుల్లారా, ఇకనైనా బానిసత్వ సంకెళ్లు తెంపుకోండి pic.twitter.com/nX5k4ty7Nk
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) October 22, 2021