బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడనాట విషాదాన్ని నింపింది. కేవలం శాండల్ వుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్రీ ప్రముఖులంతా పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొంత మంది పునీత్ ఫ్యాన్స్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదిగో ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆయన అభిమానులు కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ రమణరావు ఇంటి వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. బెంగళూరు సదాశివనగరలోని రమణరావు ఇల్లు, క్లినిక్ వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి భద్రతను కల్పించారు.
పునీత్ కుటుంబ వైద్యుడైన డాక్టర్ రమణరావు నిర్లక్ష్యం వల్లే, పునీత్ రాజ్ కుమార్ చనిపోయారని, ఆయనను అరెస్టు చేయాలనే డిమాండుతో కొన్ని సంఘాలు ఆయన ఇంటి ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితి విషమించకముందే పోలీసులు భద్రతతో పాటు, డాక్టర్ ఇంటి సమీపంలో గస్తీని పెంచారు.
మరోవైపు పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల డాక్టర్ రమణరావు ముందు నుంచి వివరణ ఇస్తూనే ఉన్నారు. మళ్లీ పోలీసు పిర్యాదు నేపధ్యంలోను ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. పునీత్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయన క్లినిక్ కు వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్సలు చేశానని రమణరావు చెప్పారు. దాదాపు 35 సంవత్సరాల నుంచి తాను రాజ్ కుమార్ కుటుంబానికి డాక్టర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు.
పునీత్ రాజ్ కుమార్ కు చికిత్సలో తమ వైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని డాక్టర్ రమణా రావు చెప్పారు. పునీత్ జిమ్ చేసిన తరువాత కాస్త నలతగా ఉందని గత నెల 29న ఉదయం 11.15 కు తన క్లినిక్ కు వచ్చారని గుర్తు చేశారు. ఆయనకు అప్పటికే చెమటలు పట్టిన కారణంగా ఈసీజీ తీశానని తెలిపారు. హార్ట్ ఎటాక్ వచ్చి ఉండవచ్చనే అనుమానంతో వెంటనే యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆస్పత్రికి వెళ్లాలని తాను చెప్పానని అన్నారు.
విక్రమ్ ఆస్పత్రికి వెళ్లడానికి అంబులెన్స్ కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని వారి కారులోనే నాలుగైదు నిమిషాలలో ఆస్పత్రికి వెళ్లేలా ప్రయత్నించామని డాక్టర్ రమణా రావు తెలిపారు. విక్రమ్ ఆస్పత్రికి వెళ్లాక అక్కడ చేసిన చికిత్స ఫలించలేని కారణంగా పునీత్ రాజ్ కుమార్ చనిపోయారని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ వైద్యం విషయంలో డాక్టర్లు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని డాక్టర్ రమణా రావు స్పష్టం చేశారు.