వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్ష చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై నిరసనగా..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ట్యాంకు బండ్ వద్ద ఉన్న రాణీ రుద్రమ దేవి విగ్రహం వద్ద మౌన దీక్ష చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని వైఎస్ షర్మిల ఫిల్మ్ నగర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు. రాణీ రుద్రమ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాణీ రుద్రమ దేవి విగ్రహం వద్దే మౌనదీక్ష మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై నిరసనగా సాయంత్రం వరకు మౌనదీక్ష చేస్తానని ఆమె తెలిపారు. ఆమె చుట్టూ ఉన్న వారు పట్టుకున్న ప్లకార్డుల్లో.. ‘తెలంగాణలో ఏటా 25 వేల అత్యాచారాలా? సిగ్గు సిగ్గు.. అతివల అపహరణలో తెలంగాణ నెంబర్ 1, ఏటా 20 శాతం పెరుగుతున్న అత్యాచారాలు’ అని రాసి ఉంది.
అంతేకాదు.. షర్మిలతో పాటు అక్కడి వారందరూ నోటికి అడ్డుగా నల్ల క్లాత్‌ను కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిల దీక్షను అడ్డుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్‌కు తీసుకెళ్లారు. షర్మిల నిన్న కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ మహిళల ఓట్ల కోసమే కేసీఆర్ ఇప్పుడు పట్టుమని 750కోట్లు ఇచ్చి, మహిళల పట్ల మరోసారి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ వ్యవహార శైలితో మహిళలు అవస్థలు పడుతున్నారు. బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. మహిళల పట్ల కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. కేసీఆర్ మాయమాటలు ఎవరూ నమ్మవద్దు’’ అని అన్నారు.