భక్తి పేరుతో ఇప్పటికే జరగకూడని దారుణాలు చాలానే జరుగుతున్నాయి. అవి చాలవన్నట్లు పవిత్రమైన హనుమాన్ మాల వేసి నాటుసారాను రవాణా చేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. చత్తీస్‌గడ్ అడవుల్లో తయారైన నాటుసారాని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్ మాలలు వేసుకున్నారు. పక్కా సమాచారంతో వాజేడు మండలంలోని పేరూరు పోలీసులు వాళ్లను పట్టుకున్నారు.
వారి వేషధారణ చూస్తే భక్తుల్లా ఉన్నారు.. కానీ వారి వద్ద ఉన్న మూటలు విప్పి చూస్తే సారా దర్శనమిచ్చింది. దీంతో షాక్ తిన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా స్మగ్లర్లు కొత్త మార్గాల్లో అక్రమ రవాణకు పాల్పడుతుండడంపై ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమానికి పాల్పడుతూ ఇలా దేవుడ్ని అడ్డం పెట్టుకోవడం పాపమని అంటున్నారు.