‘ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్’… కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. నవలా రచయితలు, కథకుల ఊహలకు ఆకాశమే హద్దు. దాన్ని మించి కూడా వారి ఊహాశక్తి ఉంటుంది. నవలా రచయితల ఊహాశక్తి గురించి ఏ మాత్రం అంచనా వేయలేం. లాజిక్‌లకు అందదు. కాల్పనికతను జోడిస్తూ నవలను రక్తి కట్టించడానికి మాత్రమే వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి వాస్తవ రూపం దాల్చుతాయనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. అమెరికాకు చెందిన డీన్ కూంట్జ్ దీని రచయిత. ఆ నవలలో వుహాన్-400 అనే వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు జీవాయుధంగా రూపొందిస్తారు. శత్రుదేశాలపై యుద్ధాల్లో ఉపయోగించేందుకు ఈ జీవాయుధాన్ని చైనా సిద్ధం చేస్తుంది. ఓ మిలిటరీ ప్రయోగశాలలో వుహాన్-400 వైరస్‌ను సృష్టిస్తారు. ప్రమాదకర వైరస్ గురించి 40 ఏళ్ల కిందటే నవలలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజాగా ఓ నెటిజన్ ఈ నవలలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కరోనా వైరస్ మొదలైన ప్రాంతం కూడా వుహాన్ కావడంతో ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. అయితే చాలామంది ఇది కాకతాళీయం కావొచ్చని అంటున్నారు. నవలలో పేర్కొన్న వైరస్ సోకితే బతకడం అంటూ ఉండదు. దానితో పోలిస్తే కరోనా తీవ్రత తక్కువేనని, బతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యర్థులపై దాడి చేయడానికి వుహాన్-400 వైరస్‌ను సృష్టించాల్సి ఉంటుందని, బయో వెపన్‌గా తీర్చిదిద్దితే ఇక తిరుగు ఉండదంటూ కొన్ని పాత్రల మధ్య చోటు చేసుకున్న సంభాషణల మధ్య వుహాన్-400 పదాన్ని ప్రయోగించాడు రచయిత. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే..డీన్ ఎంత పక్కాగా ఆలోచించాడో, తన ఊహాశక్తిని ఎంతగా పదును పెట్టాడనేది అర్థం చేసుకోవచ్చు.