తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఎందరో మహా నటుల్లో రంగనాథ్ కూడా ఒకరు. ఒక్క నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లే ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అనుకుంటారు. ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు సెలబ్రెటీలగా మారిపోతారని.. సొసైటీలో ఎక్కడలేని గౌరవం ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. నటులు కావాలన్న ఆశతో స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. అయితే రీల్ లైఫ్ ఎంత అందంగా ఉన్నా.. రియల్ లైఫ్ లో కొంత మంది నటులు బాధలు, కష్టాలు అనుభవించి చనిపోయిన వారు ఉన్నారు. సరైన అవకాశాలు లేక పోవడం.. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న నటులు కూడా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1974లో చందన అనే మూవీలో హీరోగా నటించారు. దాదాపు ఆయన 300 పైగా సినిమాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో హీరోగా నటించినప్పటికీ విలన్ పాత్రల్లో కూడా నటించేవారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు రంగనాథ్. రంగనాథ్ కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నటుడిగానే కాదు ‘మొగుడ్స్ – పెళ్లామ్స్’ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో కూడా ఆయన నటించి మెప్పించారు. నటుడిగా బాగా రాణిస్తున్న సమయంలోనే 2015, డిసెంబర్ 19న తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆప్పటికీ ఆయన వయసు 66 ఏళ్లు. ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.
రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న రోజునే ఆయన ఒక సన్మాన సభకు ముఖ్య అతిధిగా వెళ్లాల్సి ఉంది.. అందుకే ఆయన్ని స్వయంగా నిర్వాహకులు తీసుకు వెళ్లేందుకు ఇంటికి వచ్చారు. కానీ ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో ఆయన కూతురుకి సమాచారం అందించారు. అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా ఉరివేసుకొని కనిపించారు. దీంతో అందరీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రంగనాథ్ మొదటి నుంచి చాలా సున్నిత స్వభావులు.. తన భార్య చైతన్యని ఎంతగానో ప్రేమించేవారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే 14 సంవత్సరాల పాటు కన్నబిడ్డలా చూసుకుంటూ ఎన్నో సపర్యలు చేశారు. ఆమె మృతితో డిప్రేషన్ లోకి వెళ్లిపోయారు రంగనాథ్. తన రూమ్ లో దేవుడి పక్కనే ఆమె ఫోటో పెట్టుకొని ఆరాధించేవారు. తన భార్య మరణం, ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
రంగనాథ్ చనిపోయే ముందు ఆయన స్నేహితుడికి ‘గుడ్ బై సార్’ అనే మేసేజ్ పంపారని అంటారు. అంతే కాదు ఆయన రూమ్ లో ఓవైపు గోడపై ‘నా బీరువాలో ఆంధ్రాబ్యాంక్ బాండ్స్ ఉన్నాయి.. అవి పనిమనిషి మీనాక్షికి అప్పగించండి.. డోంట్ ట్రబుల్ హర్’ అని రాసి ఉంచారు. రంగనాథ్ చివరి రోజుల్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిమనిషి మీనాక్షి చేసిన సేవ మర్చిపోకుండా ఆమెకు తగిన న్యాయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆత్మహత్యకు ముందు రంగనాథ్ మానసికంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా.. ఎంత గొప్ప నటుడైనా మానసికంగా కృంగిపోయి.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది.