వాషింగ్టన్- కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఐతే అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి బాగా అదుపులోకి వచ్చింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు భారీ ఊరట లభించింది. టీకా రెండు డోసులు తీసుకున్నవారు ఇకపై బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. అయితే జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.
ఈ మేరకు తాజాగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఒంటరిగా వాకింగ్ కు వెళ్లినా, జాగింగ్, ట్రెకింగ్ కు వెళ్లినా, బైక్ పై ఒంటరిగా వెళ్లినా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది.అయితే వేడుకలకు, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలని తేల్చి చెప్పింది. ప్రజలందరూ టీకాలు వేయించుకోవాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ఇక మాస్కులు లేకుండా బయట తిరగొచ్చునని మొట్టమొదట ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇలా ప్రకటించిన రెండో దేసం అమెరికా కావడం విశేషం.