మన దేశంలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు పాటిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి వింతైన సాంప్రదాయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్లో ఓ వింత ఆచారం జరుపుకుంటారు. ఓ గిరిజన కుటుంబం తన కుమారుడికి కల్వర్టుతో వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే..
తూర్పు సింగ్భూమ్లో ఒక గిరిజన కుటుంబ సభ్యులు తమ కుమారుడికి అక్కడ ఉన్న కల్వర్టు తో వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగ తర్వాత అఖన్న జాతర జరుపుకుంటారు. ఈ సందర్భంగా చిన్నారులకు చెట్టు తో కానీ.. కల్వర్టు తో కానీ వివాహం జరిపిస్తుంటారు అక్కడి గిరిజనులు. ఈ ప్రకారం తమ కుమారుడికి కల్వర్టు తో వివాహం జరిపించామని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ సంప్రదాయం అనాధిగా వస్తుందని వారు అంటున్నారు. చిన్న పిల్లలకు తొలి దంతం పై దవడకు వస్తే ఇలాంటి వివాహాలు జరిపిస్తారు. అలా జరిపించకుంటే అశుభం జరుగుతుందని వారు నమ్ముతుంటారు. చిన్నారులకు ఐదు సంవత్సరాలు వచ్చే లోపే ఈ తంతు ముగిస్తుంటారు.
ఈ క్రమంలో సరిసింగ్ సర్ధార్ అనే వ్యక్తి తన మనవడికి కల్వర్టుతో వివాహం జరిపించాడు. చిన్నారిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి ఒక బొమ్మ బైక్ పై ఊరేగింపుగా తీసుకు వచ్చి కల్వర్టుతో వివాహ తంతు జరిపించారు. తాము పెద్దలు పాటిస్తున్న సంప్రదాయాలనే పాటిస్తున్నామని.. తమ పిల్లలకు ఎలాంటి అశుభాలు జరగకుండా దేవతలు దీవిస్తారని అంటున్నాడు సరి సింగ్ సర్ధార్. అయితే చిన్న పిల్లలకు తొలి దంగం కింది దవడకు వస్తే పెళ్లి జరిపించమని.. పై దవడకు వచ్చిన వారికే ఈ విధంగా చేస్తామని అంటున్నారు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఈ సంప్రదాయం కొనసాగిస్తారని అంటున్నారు. ఈ సంప్రదాయం ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో కూడా ఉంటుందని అన్నారు.