పెరిగిన టమాటా ధరలు టమాట సాగు చేసే రైతులకు వరంగా మారాయి. ధరల పెరుగుదలతో ఒక్కసారిగా రైతుల సుడి తిరిగిపోయింది. విపరీతమైన లాభాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు.
దేశంలో టమాట ధరలు చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజులుగా సామాన్యుడికి అందకుండా కొండెక్కి కూర్చున్నాయి టామాటా ధరలు. కిలో టామాట సుమారు రూ. 150 నుంచి రూ. 200 వరకు పెరిగి వినియోగ దారులకు షాకిచ్చింది. టమాటా మార్కెట్ లో విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయింది. టమాటాలు కొనాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. కాగా టమాటాలు కొనేవారికి దుఖం కలిగిస్తుండగా, పంటను సాగు చేసిన వారికి , వ్యాపారస్తులకు కాసుల వర్షం కురుస్తోంది. ఒక్క పంటతో టమాటా సాగు చేసిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం కష్టపడి టమాటా పండించిన రైతుకు తగిన ప్రతిఫలం దక్కుతోంది. ఇంతకు ముందు టమాటాకు సరియైన ధర లేక పంట దిగుబడి రాక అప్పులపాలైన రైతన్నలు నేడు పెరిగిన ధరలతో రికార్డ్ స్థాయిలో ఆదాయం అందుకుంటున్నారు.
ఓ వైపు నిత్యావసర ధరలు పెరిగి జనాలను బెంబేలెత్తిస్తుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు టమాటా ధరలు కూడా పెరిగి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన టమాటా ధరలు టమాటా సాగు చేస్తున్న రైతులకు వరంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణేలో టామాటా సాగు చేసే ఓ రైతు నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. టమాటాలు అమ్మి రూ. 1.5 కోట్లు సంపాదించాడు. దీంతో ఆ రైతు కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని జున్నార్ కు చెందిన రైతు తుకారాం భాగోజీ గయాకర్ తనకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిలో కొన్నేళ్లుగా టమాటా సాగు చేస్తున్నాడు. సాగు చేస్తున్న క్రమంలో ఆశించిన దిగుబడి రాక, సరైన ధరలు లేక నష్టాలను చవిచూసాడు. కాగా తాజాగా టమాటా ధరలు పెరగడంతో అదృష్టం కలిసొచ్చింది. తాను ఇటీవల 12 ఎకరాల్లో టమాటా సాగు చేయగా మంచి దిగుబడి వచ్చింది. మార్కెట్ లో టమాట కొరత ఉండడంతో రైతు గయాకర్ పండించిన పంటకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
గత నెలలో 13000 టమాట బాక్సులను మార్కెట్ లో విక్రయించగా ఏకంగా కోటి యాభై లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 20 కిలోలున్న ఒక్కొక్క టమాట బాక్స్ మార్కెట్ లో విక్రయించగా రూ. 1500 నుంచి రూ. 2400 వరకు ధర పలికింది. దీంతో ఒక్కసారిగా ఆరైతు కోటీశ్వరుడైపోయాడు. కాగా రెండ్రోజుల క్రితం రైతు గయాకర్ 900 టమాట బాక్సులను విక్రయించగా ఒక్కరోజే రూ. 18 లక్షల ఆదాయం పొందాడు. అయితే రైతు గయాకర్ మాట్లాడుతూ.. తన దగ్గర ఇంకా వేల కిలోల టమాట ఉందని ఇంకొన్ని రోజులు ధరలు ఇలాగే కొనసాగితే తన కుటుంబ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను టమాటా పంటను తెగుళ్ల భారీ నుంచి రక్షించుకుంటూ వ్యయప్రయాసాలకు ఓర్చి సాగు చేశానని ఈ కారణంగానే నాణ్యమైన టమాటాతో మంచి దిగుబడి వచ్చిందని తెలిపాడు. టమాటా సాగులో తన కొడుకు ఈశ్వర్, కోడలు సొనాలి సాయపడ్డారని వెల్లడించాడు. ఇదిలా ఉంటే కర్ణాటకాలో కూడా టమాటా సాగు చేసే రైతులు టమాటాలు అమ్మి ఒక్కరోజులోనే సుమారు రూ. 50 లక్షలు సంపాదించిన విషయం తెలిసిందే.