ప్రతి ఒక్కరి జీవితంలో అనేక కీలకమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో పెళ్లి కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి..తమకు రాబోయే భాగస్వామి మంచివారై ఉండాలని అనుకుంటారు. మంచి భర్త, మంచి భార్య కావాలని కోరుకుంటారు. సరైన సమయానికి అలాంటి మంచి భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే కొందరి జీవితాల్లో మాత్రం పెళ్లి వయస్సు దాటిపోతున్న సరైన సంబంధాలు, భాగస్వామి దొరకడం లేదు. దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. పెళ్లి విషయంలో అబ్బాయిల పరిస్థితి దారుణంగా ఉందనే చెప్ప వచ్చు. పెళ్లి కాలేదని కొందరు అబ్బాయిలు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. దీంతో చేతికి అందివచ్చిన కొడుకులు అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటంతో వారి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పెళ్లి కావడం లేదన్న మానసిక వేదనతో ప్రాణాలు తీసుకుంటున్న యువకుల సంఖ్య పెరుగుతుందని ఆ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇక ఎన్ సీఆర్ బీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గతేడాదిలో దేశవ్యాప్తంగా వివిధకారణలతో చేసుకునే ఆత్మహత్యల్లో కుటుంబ సమస్యల కారణంగా 56.6 శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. ఇందులో కూడా పెళ్లితో ముడిపడి ఉన్న ఆత్మహత్యలు 4.8 శాతం ఉన్నాయి. మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తేలింది. ఉద్యోగం రాక, కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగం కూడా కోల్పోయి వారు ఎంతో మంది ఉన్నారు. ఇదే సమయంలో వారికి పెళ్లి ఫిక్స్ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో ఆగిపోతున్నాయి. దీంతో ఒక వైపు ఉద్యోగాలు లేక మరొవైపు పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో.. పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు, బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది.
దీంతో చాలామంది యువత పెళ్లి సమస్య కారణంగా కెరియర్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. అంతేకాక అమ్మాయిని ఇచ్చే వారు కూడా అబ్బాయి జీతాలను, ఆస్తులను పరిగణలోకి తీసుకుని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొందరు అబ్బాయిలు ఉద్యోగాలులేక, ఒక వేళ ఉద్యోగాలు ఉన్న సరైన జీతం లేక పెళ్లి సంబంధాలు కుదరటం లేదని మానసిక వేదన గురైవుతున్నారు. ఇక గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువగా అబ్బాయిలే ఉన్నట్లు ఎన్ సీఆర్ బీ నివేదిక ద్వారా తెలుస్తోంది. కుటుంబ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది వివాహం. వైవాహిక సంబంధ సమస్యలతో మగవారు ప్రాణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది. కారణం మగవారు తమ సమస్యలను ఆడవారి మాదిరి బయట ప్రపంచానికి చెప్పుకోలేరు. దీంతో యువకుల తమలో తామే కుంగిపోతుంటారు.
ఉద్యోగం లేదని, పెళ్లి కావడం లేదని, కుటుంబానికి భారంగా ఉన్నామని.. ఇలా తమలో తామే తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న..మరి కొందరు మాత్రం ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఇలా పెళ్లి కావడంలేదనే మనోవేదనతో ఆత్మహత్య చేసుకునే వారిలో స్త్రీల కంటే మగవారే అధికంగా ఉన్నారని తాజాగా రిపోర్ట్ లో వెల్లడైంది. అయితే మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. ఎలాంటి సమస్య వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని, అప్పుడే జీవితంలో ముందడుగు వేయగలమని నిపుణులు అంటున్నారు.