నేటికాలంలో పక్కవాడికి సాయం చేసేందుకే ఎవరు ముందుకు రారు. ఇక ఊరి కోసం అంటే చెప్పనక్కర్లేదు. తాము, తమ కుటుంబం బాగుంటే చాలు అనుకునే జనాలు ఎక్కువయ్యారు. తమ కుటుంబం కోసం, వారసుల కోసం ధనం సంపాదించి కూడబెడతారు. పోయేటప్పుడు ఏమి తీసుకపోలేమని తెలిసి కూడా ఇతరులకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు రారు. అయితే ఇలాంటి మనుషులు ఉన్న మధ్యకూడా మనస్సున మహారాజులు ఉన్నారు. తాము ధనంలో శ్రీమంతులం కాకపోయిన…మంచి మనస్సులో మాత్రం శ్రీమంతులమే అని చాటి చెప్తుంటారు. తమ సామర్థ్యం మేరకు పుట్టిన ఊరికి సాయపడుతుంటారు. ఇటీవలే ఓ యువకుడు తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను ఊరి రోడ్ల కోసం ఉపయోగించాడు. తాజాగా మరో యువకుడు ఊరికి ఉపకారం చేసేందుకు తన ఇంట్లోని నగలను తాకట్టు పెట్టాడు. ఇంతకి ఈ యువకుడు ఊరి కోసం ఏం చేశాడు? అనే కదా మీ సందేహం.. మరీ.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కాశీపూర్ పంచాయతీ పరిధిలోని గుంజరం పంజరి గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రంజిత్ నాయక్ నివాసం ఉంటున్న గుంజరం పంజరి గ్రామంలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామం బిచులి నదికి అవతల ఉంటుంది. ఇక్కడి నుంచి పట్టణానికి రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఏ అవసరం వచ్చినా నదిలోకి దిగి వెళ్లాల్సిందే. అత్యవసర సమయంలో వైద్యం అందక చాలా మంది చనిపోయిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇలా తన గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి రంజిత్ మనస్సు చెలించింది.
ఎలాగైన ఈ నది పై వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల పాటు వాహనాలను నడిపేందుకు వెళ్లి.. ఓవర్ డ్యూటీలు చేసి కొంత సొమ్ము కూడబెట్టాడు. అంతేకాక భార్యకు కొన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారు. తన వద్ద ఉన్న డబ్బులతో పాటు భార్య నగలు అమ్మగా వచ్చిన 70 వేల రూపాయలతో నదిపై కర్రలతో వంతెన నిర్మిస్తానని తండ్రికి చెప్పాడు. కుమారుడి ఆశయం నచ్చిన ఆ తండ్రి..తాను కూడా సాయం చేస్తాన్ని చెప్పాడు. ఈక్రమంలో కొన్నాళ్లు తన ఉపాధికి విరామం ఇచ్చిన రంజిత్ ఊరికోసం వంతెన నిర్మాణాన్ని చేపట్టాడు. ఇక తండ్రీ కొడుకులు కలిసి నదిపై కర్రల వంతెనను నిర్మించారు. నది సమీపంలో నుంచి ఊరికిలోకి వెళ్లేందుకు చుట్టు ఉన్న పొదలు తొలగించి, 4 కి.మీ మట్టి రోడ్డు వేశారు. ఈ తండ్రీకొడులుకు వంతెన నిర్మాణం, మట్టి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగు నెలలు శ్రమించారు.
వంతెన నిర్మాణంతో ఆ గ్రామస్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ నాయక్ కి, అతడి తండ్రికి ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. “దారి వేయలాని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము. అందుకే వారిని నమ్ముకునే కంటే తామే సొంతంగా నిర్మాణం చేపడితే మేలు అని భావించాము. అందుకే కర్రల వంతెన, మట్టి రోడ్డు నిర్మించాము” అని రంజిత్ తెలిపారు. ఈ విషయం తెలిసిన చుట్టు పక్కల గ్రామాల వాళ్లు రంజిత్ ను ప్రశంసలతో ముంచెత్తారు. మంచి మనస్సులో అతను అందరికి కంటే శ్రీమంతుడని అభినందించారు. మరీ.. ఈ శ్రీమంతుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.